విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్ శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ...
చీపురుపల్లి : యుద్ధం వద్దు.. శాంతి ముద్దు, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ చీపురుపల్లి, గరివిడి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీపురుపల్లి పట్టణంలో మంగళవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచంపై డాలర్ ఆదిపత్యం తగ్గుతుందన్న భయంతో అమెరికా ప్రపంచ దేశాలపై దాడులకు తెగబడుతుందని విమ ర్శించారు. వెనిజులా దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి ఆదేశ సుప్రీం లీడర్‌ను హతమార్చడం తగదన్నారు. ఇరాన్‌లోని పాఠశాలపై బాంబు దాడి కారణంగా 170 మంది పసి పిల్లలు మరణానికి అమెరికా బాధ్యతవహించాలన్నారు. ప్రస్తుతం క్యూబా దేశంలో ఆర్థిక ఆంక్షలు పెడుతోందని, దీనిని ప్రజా సంఘాల తరఫున ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


