● మన్యం జిల్లా కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తాం
● కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి
సాలూరు: రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా, ప్రత్యేకంగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని, జిల్లా కీర్తిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. సాలూరు పట్టణంలోని డబ్బివీధి జెడ్పీహెచ్ పాఠశాలను జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి యశ్వంత్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. పాఠశాలలో విద్యాసౌకర్యాలు, మధ్యాహ్నభోజన పథకం అమలుతీరు, ముస్తాబు కార్యక్రమ పురోగతిని నేరుగా పరిశీలించారు. మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని భోజన నిర్వాహకులకు హెచ్చరించారు. ప్రతి శనివారం పాఠశాలల్లో మన్యం డ్యాన్స్‌పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఆనందలహరి కార్యక్రమం దోహదపడుతుందని, దీనిని నీతి ఆయోగ్ సైతం గుర్తించడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఈ నెల 22 జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల మంది విద్యార్థులు, మహిళలు, యువతతో భారీ స్థాయిలో కోలాట ప్రదర్శన నిర్వహించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగా ఔత్సాహికులందరినీ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నట్టు వెల్లడించారు. అంతకుముందు మంత్రి సంధ్యారాణితో కలిసి డంపింగ్‌యార్డును పరిశీలించి, లెగసీ వ్యర్థాల ప్రాసెసింగ్ పనులను ప్రారంభించారు. చెత్తసేకరించే డబ్బాలను కార్మికులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్, తహసీల్దార్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.


