రైతు ఇంట బెల్లం పంట
● తప్పని పరిస్థితిల్లో బెల్లం క్రషర్ల ఏర్పాటు
● జిల్లాలో 35–40 బెల్లం క్రషర్లు
● చెరకు టన్నుకు 115 కేజీల బెల్లం దిగుబడి
సీతానగం: జిల్లాలోని రైతులు వాణిజ్యపంటగా ఎంపిక చేసుకుని పండిస్తున్న పంటల్లో చెరకు పంట ఒకటి. రైతులు పండించిన చెరకు కొనుగోలు చేయడానికి లచ్చయ్యపేట వద్ద రాష్ట్ర ప్రభుత్వం (ఎన్‌ఎస్ ఎఫ్/ఎల్ పేరున) చక్కెర కర్మాగారాన్ని గతంలో నిర్మించింది. కర్మాగారం పరిధిలో ఉన్న 16 మండలాల్లో 13 వేలమంది రైతులు 20 వేల ఎకరాల విస్తీర్ణంలో చెరకుపంట సాగు చేయగా 4లక్షల నుంచి 7 లక్షల టన్నుల చెరకు ప్రతి ఏటా ఉత్పత్తి జరిగేది. చెరకు సాగు ప్రభుత్వానికి, రైతాంగానికి బాగున్నప్పటికీ నష్టాలు చూపిన అప్పటి ప్రభుత్వం రూ.62కోట్లతో నిర్మించిన చక్కెరకర్మాగారాన్ని ఎన్‌సీఎస్ యాజమాన్యానికి తక్కువధరకు విక్రయించింది.
ఎన్‌సీఎస్ యాజమాన్యం చేసిన తప్పిదాల కారణంగా కర్మాగారం మూతపడింది. దీంతో చెరకు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడి రైతులు పండించిన చెరకును సంకిలిలోని ఈఐడీ ప్యారీస్ చక్కెర కర్మాగారానికి తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. చెరకు పండించిన చిన్నసన్నకారు రైతులు దూర ప్రాంతంలో ఉన్న కర్మాగారానికి తరలించలేని కారణంగా, సంకిలి కర్మాగార యాజమాన్యం రైతులకు వాహనాలు సక్రమంగా సమకూర్చక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిగ్రామాల్లో చెరకు పండించిన చిన్న సన్నకారు రైతులు తమ వెసులుబాటును చూసుకుని బెల్లం క్రషర్లను ఏర్పాటు చేసుకున్నారు.అలాగే మరికొంత మంది దీనినిఆసరాగా చేసుకుని రైతుల నుంచి వ్యాపారస్తులు చెరకు కొనుగోలు చేసి క్రషర్లు నెలకొల్పి బెల్లం వ్యాపారాలు చేస్తున్నారు. పిఠాపురం, రావులపాలెం, రామచంద్రపురం, పాలకొల్లు, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు బెల్లం క్రషర్లు నెలకొల్పారు.
సంకిలి చక్కెర కర్మాగారం సక్రమంగా పని చేయకపోవడంతో చెరకు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. 2025–26 సీజన్‌లో ఆయా మండలాల్లో రైతులు 80 వేల టన్నుల చెరకు ఉత్పత్తి చేశారు. కర్మాగారం మూతపడిన కారణంగా సంకిలి చక్కెర కర్మాగారానికి చిన్న సన్నకారు రైతులు చెరకు సరఫరా చేయలేని వారు బెల్లంక్రషర్లకు విక్రయిస్తున్నారు. కొంతమంది రైతులు సొంతంగా క్రషర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్‌సీఎస్ కర్మాగారం పరిధిలో ఉన్న బాడంగి, బొబ్బిలి, తెర్లాం, సీతానగరం, రామభద్రపురం, మక్కువ తదితర మండలాల్లో 35–40 బెల్లం క్రషర్లు పని చేస్తున్నాయి. రోజుకు ఒక్క క్రషరులో బెల్లం తయారు చేయడానికి 6 నుంచి 8 టన్నుల చెరకు అవసరం అవుతుంది. ఉన్న క్రషర్లకు రోజుకు 300 టన్నుల చెరకు బెల్లం తయారీకి అవసరం. రైతుల కుటుంబ సభ్యులతో పొలంలోని చెరకు నరికి క్రషరుకు సరఫరా చేస్తున్నారు. మండలాల్లోని బెల్లం క్రషర్ల నిర్వాహకులు రైతులనుంచి టన్ను చెరకు రూ.2,600 నుంచి రూ.2,800 వరకూ కొనుగోలు చేస్తున్నారు.
క్రషర్‌లో తయారుచేసిన బెల్లానికి గిరాకీ..
మండలంలోని బెల్లం క్రషర్ల నిర్వాహకులు రసాయనాలు వేయకుండా ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ తయారుచేసిన బెల్లం విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాలకు తరలిస్తారు. అందులో సింహభాగం బెల్లం ఒడిశా, రాయ్‌పూర్, జగదల్‌పూర్, నవరంగ్‌పూర్ ప్రాంతాల వారు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
పది మందికి ఉపాధి కల్పన
కోతదశకు వచ్చిన పంటను గానుగ ఆడించి బెల్లం తయారు చేస్తున్నాం. బెల్లానికి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. మేము పండించిన చెరకుతో బెల్లం తయారు చేయడంతో పాటు పదిమందికి ఉపాధి కల్పిస్తున్నామన్న సంతృప్తి ఉంది. మాకు పెట్టుబడులు పోను లాభం కనిపిస్తోంది. మాతో పాటు చాలామంది రైతులు బెల్లం తయారీపై దృష్టిసారించారు. సంక్రాంతి పండగ అవసరాలు తీరేలా బెల్లం తయారు చేస్తున్నారు. ఎల్.వి.కుమార్,
క్రషరు నిర్వాహకుడు, అంకలాం
రైతు ఇంట బెల్లం పంట
రైతు ఇంట బెల్లం పంట


