బాక్స్‌లో క్రికెట్
విజయనగరం: క్రికెట్ అంటే పెద్ద మైదానం..రెండు జట్లు, పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు గుర్తుకొస్తారు. నగరంలో ఖాళీ స్థలాలన్నీ కనుమరుగవడంతో ఆటతీరు మారింది. ఆసక్తి ఉన్నవారు క్రికెట్ సాధన చేయడానికి వినూత్నంగా ఆలోచించి ఆచరణలోకి తెచ్చిందే బాక్స్ క్రికెట్. ఇది విపరీతంగా ట్రెండ్ అవుతోంది. విల్లా, అపార్ట్‌మంట్, రెస్టారెంట్..ఎక్కడ చిన్నపాటి స్థలం ఉన్నా బాక్స్ ఏర్పాటు చేసి చుట్టూ నెట్ కట్టేస్తున్నారు. 30 అడుగుల ఎత్తు ఉండేలా వాటిని నిర్మిస్తారు. ప్లాస్టిక్ గడ్డిని ఉపయోగిస్తారు. దుమ్ము, ధూళి బాధ ఉండదు. 250 నుంచి 350 గజాల స్థలం సరిపోతుంది.
గంట చొప్పున రెంట్..
బాక్స్ క్రికెట్ ఆడాలనుకుంటే గంట చొప్పున చార్జ్ చేస్తారు. ప్రస్తుతం రూ.500–రూ.2,000 వరకు వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అదనం. రాత్రిళ్లు ఆడకోవడానికి యువత ఆసక్తి చూపిస్తుంటారు. బాల్, బ్యాట్, ప్యాడ్లు మొత్తం వాళ్లే ఇస్తారు.
అదనపు సౌకర్యాలు..
బాక్స్ క్రికెట్లో ఎక్కువ శాతం టెన్నిస్ బాల్‌నే వాడుతారు. దీంతో గాయాలయ్యే ప్రమాదం తక్కువ. బ్యాటర్ కొట్టిన బంతి చుట్టూ ఉన్న నెట్‌లో ఒకస్థాయి వరకు వెళ్తే ఫోర్, మరింత ఎత్తుకు వెళ్తే సిక్సర్‌గా పరిగణిస్తారు. పైన టాప్‌కు తగిలితే పెవిలియన్ చేరాల్సిందే. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనుకునే వారికి ఇది మంచిది. ఆడి అలసిపోతే సేద తీరడానికి కెఫేలు ఉంటాయి. చాలామంది వారాంతాల్లో బాక్స్ క్రికెట్‌ను అటు వినోదం, ఇటు ఆరోగ్యం కోసం ఎంచుకుంటున్నారు. బుక్ చేసుకోవడానికి యాప్ లు ఉన్నాయంటే వాటికి డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
● భారీగా వెలుస్తున్న శిక్షణ మైదానాలు
● సంక్రాంతి నేపథ్యంలో పెరిగిన ఆదరణ


