రామతీర్థంలో వైభవంగా గోదాదేవి కల్యాణం
నెల్లిమర్ల రూరల్: భోగి పర్వదినం సందర్భంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో గోదాదేవి కల్యాణాన్ని ఆలయ అర్చకులు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గడిచిన నెల రోజుల నుంచి ఆలయంలో తిరుప్పావై పాసురాలను స్వామికి విన్నవించారు. ఆలయంలో ప్రత్యేక పూజలనంతరం గోదాదేవి అమ్మవారి కల్యాణాన్ని కనుల పండువగా చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పురాతన దేవాలయంలో..
మండలంలోని ఎంబేరేయగుళ్లు గ్రామంలో 1000 ఏళ్ల చరిత్ర కలిగిన అతి పురాతన శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కల్యాణ వెంకటేశ్వరాలయంలో ధనుర్మాస పూజలు
బొబ్బిలి: పట్టణంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవి, రంగనాయకుల కల్యాణోత్సవాన్ని భక్తుల వీక్షణల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన పురోహితులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం కన్నుల పండువగా జరిగింది.
రామతీర్థంలో వైభవంగా గోదాదేవి కల్యాణం


