ఎడ్ల బళ్ల పోటీల విజేత నందిగాం
● భోగి రోజున కూనాయవలసలో జిల్లా స్థాయి పోటీలు
● ఆద్యంతం ఉత్కంఠ
తెర్లాం: భోగి పండగ సందర్భంగా మండలంలోని కూనాయవలస గ్రామంలోని కొత్త పోలమ్మ యూత్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామంలో ప్రతీ ఏటా సంక్రాంతి పండగ సందర్భంగా ఎడ్ల పోటీలను నిర్వహిస్తున్నారు. తెర్లాం, బాడంగి మండలాల నుంచి అధిక సంఖ్యలో రైతులు తమ ఎడ్లతో వచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎడ్ల బళ్ల పోటీల్లో తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన ఆర్నిపల్లి కూర్మినాయుడు ఎడ్లు తక్కువ సమయంలో లక్ష్యాన్ని చేరుకొని ప్రథమ స్థానంలో నిలిచాయి. మండలంలోని నందబలగ, కొరటాం గ్రామాలకు చెందిన ఎడ్లు ద్వితీయ, తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నాయి. ప్రథమ స్థానంలో నిలిచిన ఎడ్లకు రూ.5వేలు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ఎడ్లకు రూ.4వేలు, రూ.3వేలు చొప్పున గ్రామ సర్పంచ్ బోడెల విజయబాబు, మాజీ ఎంపీపీ బోడెల సింహాచలం, మాజీ ఎంపీటీసీ కర్రి సత్యనారాయణ తదితరుల చేతుల మీదుగా నిర్వాహకులు నగదు బహుమతులను రైతులకు అందజేశారు. కూనాయవలసలో జరిగిన ఎడ్ల బళ్ల పోటీలను తిలకించేందుకు తెర్లాం, బాడంగి మండలాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఎడ్ల బళ్ల పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కొత్తపోలమ్మ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు చేశారు.


