
ఒక్కరైనా లేరా సారూ!
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన, ప్రభుత్వ విద్యపై కూటమి సర్కారు చిన్నచూపు చూస్తోంది. కొండకోనలు, మారుమూల ప్రాంతాల్లో ఉండే ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. టీచర్లు బదిలీపై వెళ్తే.. ఆ స్థానంలో కొత్తగా ఎవరూ భర్తీ కావడం లేదు. దీంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 350 జీపీఎస్ (ఏకోపాధ్యాయ పాఠశాలలు) ఉండగా.. అందులో 115 పాఠశాలలకు ఉపాధ్యాయులే లేరు. దీంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ఉపాధ్యాయుడు వచ్చినప్పుడే చదువు. లేకుంటే విద్యార్థులు ఇంటికే పరిమితమవుతున్నారు. కొన్నిచోట్ల పాఠశాలకు వచ్చి, వెళ్లిపోతున్నారు. ఇటీవల 100 మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై జీపీఎస్‌కు సర్దుబాటుచేశారు. ఇందులో సీఆర్టీలతో పాటు ఆశ్రమ పాఠశాలలకు చెందిన రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. వీరిలో అధిక శాతం మందికి నియోజకవర్గాలు దాటి.. దాదాపు వంద కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్ వేశారు. భద్రగిరి ఏహెచ్‌ఎస్ నుంచి వి.పావని అనే ఎస్‌జీటీని పాచిపెంట మండలంలో బడ్నాయివలస స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని బొడ్డపాడు జీపీఎస్‌కు వేశారు. కురుపాం మండలం జి.శివడ నుంచి బి.శోభన అనే ఎస్‌జీటీని పాచిపెంట మండలంలోని యేటగానివలస స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని కన్నయ్యవలస జీపీఎస్‌కు డిప్యుటేషన్‌పై నియమించారు. గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ నుంచి ధర్మారావు అనే ఎస్‌జీటీని పాచిపెంట మండలం బడ్నాయివలస స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని సరళపాడు జీపీఎస్‌కు సర్దుబాటుచేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దీనివల్ల అక్కడికి వెళ్లేందుకు వారెవరూ ఇష్టపడడం లేదు. ఫలితంగా అనేక బడులు పూర్తిగా మూతపడుతున్నాయి. పిల్లలకు చదువు, మధ్యాహ్న భోజనం వంటివి అందడం లేదు.
బోధకులు లేక.. బోధపడేదెలా?
జిల్లాలో పి.కోనవలస, భద్రగిరి, కురుపాం, సీతంపేటలలో పీటీజీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సబ్జెక్టు అధ్యాపకుల కొరత వెంటాడుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికీ పలు సబ్జెక్టులను బోధించే అధ్యాపకులను నియమించకపోవడం గమనార్హం. గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరి పీటీజీలో జువాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించే ముగ్గురు అధ్యాపకులు లేరు. కురుపాంలో ఫిజిక్స్, ఇంగ్లిష్ వంటి కీలక సబ్జెక్టులను బోధించే వారు లేరు. ఇక్కడే నడుస్తున్న కురుపాం బాలికల గిరిజన పాఠశాలకు ఫిజికల్ సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టు బోధించే టీచర్లు లేరు. దీంతో విద్యార్థుల విద్యాబోధనకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలా అయితే పాఠాలు ఎలా అర్థం చేసుకోగలమని, పరీక్షలకు ఏ విధంగా సిద్ధం కాగలమని విద్యార్థులు వాపోతున్నారు.
ఉపాధ్యాయుడు వచ్చినప్పుడే చదువు
జీపీఎస్ పాఠశాలల్లో పరిస్థితి
మరీ దారుణం
పీటీజీ కళాశాలల్లో సబ్జెక్టు
అధ్యాపకుల కొరత
ఆవేదనలో విద్యార్థులు, వారి
తల్లిదండ్రులు
పేద విద్యార్థులపై చిన్నచూపు
కొండకోనలు, మారుమూల ప్రాంతాల్లో ఉండే పాఠశాలలపై ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. టీచర్ల కొరతతో విద్యార్థులకు చదువు అందడం లేదు. మెగా డీఎస్సీ అంటూ ప్రకటనలే చేస్తున్నారు గానీ.. గిరిజన ప్రాంతాలకు ఉపాధ్యాయులను పూర్తిస్థాయిలో భర్తీ చేయడం లేదు. పీటీజీ కళాశాలల్లో సబ్జెక్టు లెక్చరర్లు లేకపోతే విద్యాబోధన ఎలా సాగుతుంది. తక్షణమే సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి.
– పి.రంజిత్‌కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి