డిజిటల్‌ బోర్డుల పేరిట దోపిడీ | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ బోర్డుల పేరిట దోపిడీ

Aug 1 2025 12:43 PM | Updated on Aug 1 2025 12:43 PM

డిజిట

డిజిటల్‌ బోర్డుల పేరిట దోపిడీ

కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు తయారైంది కూటమి ప్రభుత్వం తీరు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ తీసుకోవడం లేదు కానీ..ప్రజలను ఏదో రకంగా దోచుకోవడమే లక్ష్యంగా చేసుకుందని చెప్పడానికి డిజిటల్‌ బోర్డుల ఏర్పాటు పేరుతో చేస్తున్న కలెక్షన్లు ఉదాహరణగా నిలుస్తున్నాయి. –వీరఘట్టం

తప్పుల తడకగా ఇంటి నంబర్ల నమోదు

ఒక్కో బోర్డుకు రూ.50 చొప్పున వసూలు

ఈ పొటో చూశారా? వీరఘట్టంలోని తెలగవీధిలో ఓఇంటికి 5–18 నంబర్‌ వేస్తూ బోర్డు అతికించారు.అయితే ఈ ఇంటి నంబర్‌ 6–68 అని పంచాయతీ రికార్డులో ఉంది.తప్పులు తప్పులుగా బోర్డులు అతికించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని వారు చెబుతుండడంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ వారడిగిన రూ.50 ఇచ్చేస్తున్నామని ప్రజలు చెబుతున్నారు.

ప్రతి ఇంటికి డిజిటల్‌ ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటు పేరుతో ప్రజల నుంచి దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీపై జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారి ఈ ఏడాది మార్చి 23న ఉత్తర్వులు ఇచ్చినట్లు బోర్డులు అమర్చడానికి వచ్చినవారు చెబుతున్నారు. అధికారులు ఇచ్చిన జీవో కాపీ చూపిస్తున్నారు. అయితే ఈ డిజిటల్‌ బోర్డుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు.అభ్యంతరాలుంటే బోర్డులు బిగించవద్దని,.పేద, మధ్య తరగతి వారికి ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ జీవో కాపీలో ఉంది.అయితే అవేవీ కాకుండా ప్రతి ఇంటికి బోర్డు బిగించి డబ్బులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.అయితే ఈ బోర్డుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారే తప్ప ఈ నిలువు దోపిడీని అడ్డుకోకపోవడంపై ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇంటింటికీ ఏర్పాటు చేస్తున్న ఇంటి నంబర్లు తప్పుల తడకగా ఉన్నాయి.

ఫోన్‌ కాల్స్‌ ఒత్తిడితో..

అమరావతి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ ఒత్తిడితో ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటుకు జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ ముఠా నేరుగా గ్రామాల్లో ఇంటి చిరునామా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.పేరుకు వీరు ఒక్కో ఇంటి నుంచి కలెక్షన్‌ చేస్తున్నది రూ.50 గా కనిపిస్తున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా చూస్తే రూ.2.25 కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. కొంత మంది మాత్రం ఈ బోర్డులు వద్దని తిరస్కరిస్తున్నప్పటికీ వారితో వాదిస్తూ ఈ బోర్డులు అందరి ఇళ్లకు వేయాలని మా వద్ద ఆర్డర్‌ కాపీ ఉందని బలవంతంగా ఈ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఫొటో చూశారా?

చిన్న ఇనుప రేకును తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మన్యం జిల్లా, డిజిటల్‌ ఇంటి చిరునామా అనే అక్షరాలు ఉన్న ప్రతి ఇంటి గుమ్మానికి అతికిస్తున్నారు. ఇలా రేకు బోర్డు పెట్టినందుకు ప్రతి ఇంచి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. వీరఘట్టం మండలంలో ఇంతవరకు సుమారు 15 వేల ఇళ్లకు ఇటువంటి బోర్డులు పెట్టి గృహవాసుల నుంచి రూ.7.50 లక్షలను వసూలు చేశారు. ఇదే మాదిరి జిల్లాలో ఉన్న 4.50 లక్షల గృహాలకు ఇటువంటి బోర్డులు అమర్చి ఏకంగా రూ.2.25 కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. డిజిటల్‌ బోర్డు పేరుతో ఇంటికి అమర్చుతున్న ఈ రేకు కనీసం రూ.5 కూడా ఉండదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాకు సంబంధం లేదు

జిల్లాలో చాలా చోట్ల ఇంటికి డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.అయితే ఆ బోర్డుల ఏర్పాటుకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నచ్చకపోతే ఎవరూ ఆ బోర్డులు ఏర్పాటు చేసుకోవద్దు. ఎక్కడైనా బోర్డులు ఏర్పాటు చేయాలనుకుంటే గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి, పంచాయతీ అంగీకారంతో పంచాయతీ రికార్డుల ప్రకారం ఇంటి నంబర్లు వేసి బోర్డులు ఏర్పాటు చేయవచ్చు. ఇష్టం లేని వారు బోర్డులు వద్దని చెప్పండి.

– పి.కొండలరావు,

డీపీఓ, పార్వతీపురం మన్యం జిల్లా

డిజిటల్‌ బోర్డుల పేరిట దోపిడీ1
1/2

డిజిటల్‌ బోర్డుల పేరిట దోపిడీ

డిజిటల్‌ బోర్డుల పేరిట దోపిడీ2
2/2

డిజిటల్‌ బోర్డుల పేరిట దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement