
మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి
విజయనగరంఫోర్ట్: స్వచ్ఛభారత్ మిషన్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 147 అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. తన చాంబర్‌లో మరుగుదొడ్ల నిర్మాణంపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు. మరో 74 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపించామని సూచించారు. ఒకటి రెండు రోజుల్లో వీటికి అనుమతి తెప్పిస్తామని తెలిపారు. 144 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆగస్టు 20వ తేదీలోగా నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారానికి 31 అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ మువ్వ లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌పీసీఐ తప్పనిసరి
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం రూరల్: అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు రైతులు బ్యాంకుల వద్ద ఎన్‌పీసీఐ చేయించుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో దాదాపు 14 వందల మంది రైతుల ఎన్‌పీసీఐ వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌పీసీఐ పెండింగ్ ఉన్న రైతుల వివరాలు గ్రామ రైతు సేవా కేంద్రంలో ఉన్నాయని ఆయన తెలిపారు. రైతులకు బ్యాంకు అధికారులు సహకరించాలని సూచించారు.
ఈవీఎం గొడౌన్ పరిశీలన
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గొడౌన్‌ను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత ఉన్నారు.
బియ్యాలవలస పరిసరాల్లో ఏనుగుల గుంపు
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలం బియ్యాలవలస గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు బుధవారం సంచరించింది. వ్యవసాయ పనుల సీజన్‌లో పొలాల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపు తరలింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఏనుగులు సంచరిస్తున్న బియ్యాలవలస ప్రాంతంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు.

మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి