
పాముకాటుతో విద్యార్థికి అస్వస్థత
సాలూరు రూరల్: మండలంలోని తోణాం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కార్రాసునీల్ పాముకాటుతో అస్వస్థతకు గురయ్యాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం సంపంగిపాడు పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన సునీల్ తోణాం ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ ఉదయం బహిర్భూమికి వెళ్లే అలవాటు ప్రకారం మంగళవారం బయటకు వెళ్లే సమయంలో పాముకాటుకు గురయ్యాడు. దీనితో వెంటనే పాఠశాల వార్డెన్ లచ్చయ్య తోణాం ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం సాలూరు ఏరియా ఆస్పత్రికి అక్కడినుంచి విజయనగరంలోని ఘోషా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వార్డెన్ లచ్చయ్య విద్యార్థిని దగ్గరుండి చూసుకుంటున్నారు.
పీఎంశ్రీ పథకంలో బొబ్బిలి గురుకులం ఫస్ట్
బొబ్బిలి: పీఎంశ్రీ పథకంలో బొబ్బిలి గురుకుల పాఠశాల జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు ప్రిన్సిపాల్ రఘునాథరావు తెలిపారు. పట్టణంలోని సింహాల తోటలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలను పీఎంశ్రీ పథకంలో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్ విధానంలో మంగళవారం జాతికి అంకితం చేశారన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఏపీడీ ఎ.రామారావు, ఎంఈఓలు చల్ల లక్ష్మణరావు, గొట్టాపు వాసు, గురుకుల సిబ్బంది, ఎంపిక చేసిన విద్యార్థులు పాల్గొన్నారు.
పరిశ్రమల దరఖాస్తులు
గడువులోగా పరిష్కరించాలి●
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్
విజయనగరం అర్బన్: జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అందిన దరఖాస్తులను సింగల్ డెస్క్ పాలసీ కింద 21 రోజుల్లో పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మే నుంచి జూలై వరకు 1652 దరఖాస్తులు అందగా 1634 దరఖాస్తులకు అనుమతి ఇచ్చామని, మిగిలిన వాటిలో 11 దరఖాస్తులు కాలుష్య నియంత్రణ మండలి వద్ద, మిగిలినవి ఫైర్, గ్రౌండ్ వాటర్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజి శాఖల వద్ద పెండింగ్ ఉన్నాయన్నారు. వాటిని గడువు లోగా పరిష్కరించాలని, తిరస్కరిస్తే తగిన కారణాలతో తిరస్కరించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కరుణాకర్, నాబార్డ్ డీడీఎం నాగార్జున, ఎల్‌డీఎం రమణమూర్తి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ లక్ష్మణ రావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, జిల్లా ఫైర్ ఆఫీసర్ రామ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు, ఫ్యాక్టరీస్, స్కిల్ డెవలప్‌మెంట్, శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గొడౌన్ల తనిఖీ
నెల్లిమర్ల: నెలిల్లమర్లలో ఉన్న ఈవీఎం గోదాములను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకు, లోపలి గదులకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించారు. బందోబస్తుపై సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా చుట్టుపక్కల, గొదాముల్లోని పరిస్థితులను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్‌డీఓ డి.కీర్తి, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పాముకాటుతో విద్యార్థికి అస్వస్థత