
దివ్యాంగులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలి
పార్వతీపురం టౌన్: దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరిచేందుకు పర్పుల్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కాంపోజిట్ రీజనల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలెప్‌మెంట్, రీహ్యాబిలిటేషన్ అండ్ ఎంపవర్‌మెంట్(సీఆర్‌సీ), నెల్లూరు, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో పర్పుల్ ఫెయిర్ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బి.విజయచంద్రలు దివ్యాంగులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి వారిలో ఉండే ప్రతిభను గుర్తించి అభినందించారు. విబిన్న ప్రతిభా వంతుల్లో కూడా అసమాన్య ప్రతిభ ఉంటుందని, దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే సామాన్యుల కంటే తీసుపోరని కితాబిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పర్పుల్ ఫెయిర్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో తొలిసారిగా పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. బ్రెయిన్ హెల్త్ ఆటిజం మొదలైన బాధితులకు చికిత్స ఇచ్చేందుకు నీతి అయోగ్‌తో పార్వతీపురంలో ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. భవిత కేంద్రాల్లో దివ్యాంగులకు అవసరమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కురుపాం మండల కేంద్రానికి చెందిన విద్యార్థి తనలోని లోపాలను చూసి వెనుకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో గ్రాండ్ బ్రిక్స్‌లో 1500మీటర్లు, 400మీటర్ల పరుగు పందెంలో ఒక గోల్డ్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించినట్లు తెలిపారు.
దివ్యాంగుల కలల సాకారం
ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ విభిన్న ప్రతిభా వంతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ దివ్యాంగుల కలలను సాకారం చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఉపకరణాలను, స్టాల్స్ యాజమానులకు జ్జాపికలను అందజేశారు. కార్యక్రమంలో సీఆర్‌సీ డైరెక్టర్ మనోజ్ కుమార్, విబిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఎ.డి ఎల్‌ఎన్‌వీ శ్రీధర్, డీఈఓ బి.రాజ్‌కుమార్, డీవీఈఓ వై. నాగేశ్వరరావు, ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్