ప్రజల రక్షణకు నిలవాల్సిన వేళ పోలీసులు పక్షపాతపు నీడలో ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా గంట మోగగానే ప్రతిపక్ష నాయకుల కాళ్లకు సుమోటో బంధనాలు బిగిస్తున్నారు. ఊళ్లో ఊపిరి పీల్చుకునే హక్కును కాలరాస్తూ ప్రతిపక్షంలో ఉన్నారనే కారణంతో అర్ధరాత్రి నోటీసులతో బెంబేలెత్తిస్తున్నారు. ఓటరు వద్దకు ప్రతిపక్షాల అడుగులు పడేలోపే ఖాకీల ఆంక్షలతో అడ్డుగోడ కడుతున్నారు. మరోవైపు అధికార పక్ష శ్రేణులకు అభయమిస్తూ రాచబాట పరుస్తున్నారు. చట్టాలను అధికారానికి చుట్టాన్ని చేస్తూ ఎన్నికల నియమావళికి మంగళం పాడుతున్నారు. ఇప్పటికై నా పోలీసు వ్యవస్థను నిష్పక్షపాతంగా పని చేసేలా, న్యాయాన్ని గెలిపించేలా ఎన్నికల అధికారులు కోడ్ కొరడా ఝుళిపించాలని ప్రజలు కోరుతున్నారు.


