రౌడీషీట్‌ పేరుతో బెదిరింపు | - | Sakshi
Sakshi News home page

రౌడీషీట్‌ పేరుతో బెదిరింపు

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

రౌడీషీట్‌ పేరుతో బెదిరింపు

● జిల్లాలో వైఎస్సార్‌సీపీ

నాయకులపై బైండోవర్‌ కేసులు

● ఒక్కో స్టేషన్‌లో వందల

సంఖ్యలో అక్రమ కేసులు

● ఇదెక్కడి న్యాయమంటూ

నిలదీస్తున్న ప్రజలు

నరసరావుపేట టౌన్‌: ఎన్నికలు అంటే ప్రజల తీర్పును కోరాలి.. ప్రజల్లోకి వెళ్లి విశ్వాసాన్ని పొందాలి.. ప్రత్యర్థులతో రాజకీయంగా పోరాడాలి. కానీ పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ పోరాటం పోలీస్‌ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతోంది. ప్రజల్లో ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక భయంతో అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్‌ సీపీని కట్టడి చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై బైండోవర్‌ కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో బరి తెగిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోవాల్సిన ప్రత్యర్థులను పోలీస్‌ చర్యలతో నిలువరిస్తున్నారు. మాములుగా పోటీ చేసి గెలవటం అసాధ్యమని, దౌర్జన్యాలతో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. గతంలో ఉన్న ఫిర్యాదులను వెలికి తీసి అక్రమ కేసులు బనాయించేందుకు పావులు కదుపుతున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఉన్న వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సుమారు వెయ్యి మందికి పైగా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలే టార్గెట్‌గా అక్రమ బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. తహసీల్దార్‌ ఎదుట హాజరుపరిచి ఒక్కొక్కరిని రూ.5 లక్షల పూచీకత్తుపై విడుదల చేశారు. జిల్లాలో మాచర్ల, గురజాల, చిలకలకూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహాలో ప్రత్యర్థులను అడ్డుకునేందుకు రాజకీయ అస్త్రాలుగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

అధికారుల తీరుపై విమర్శలు

వందల సంఖ్యలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై బైండోవర్‌ కేసులు నమోదు చేసిన పోలీసులు పదుల సంఖ్యలో కూడా టీడీపీ కార్యకర్తలపై నమోదు చేయకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఒక ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు ఇరు పార్టీలకు చెందిన వ్యక్తులను వేరువేరుగా బైండోవర్‌ చేయాల్సి ఉంది. అయితే కేవలం వైఎస్సార్‌సీపీ వారినే లక్ష్యంగా చేసుకొని బైండోవర్‌ కేసులు, భారీ పూచీకత్తులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రిజర్వేషన్లు ప్రకటించినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు, వారి సన్నిహితుల జాబితాను తీసుకొని బైండోవర్‌ కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నారు. ప్రతి రోజు స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. బైండోవర్‌ కేసుల్లో ఉన్న వారిపై మరో కేసు నమోదు అయితే రౌడీషీట్‌ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. శాంతిభద్రతలు కాపాడటం ఎంత ముఖ్యమో.. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడటం అంతే ముఖ్యం. అయితే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారనే భావన ఏర్పడుతోంది. బైండోవర్‌ చర్యలు శాంతిభద్రతల పరిరక్షణకు కాకుండా రాజకీయ ఒత్తిళ్లతో జరిగాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement