స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు నరసరావుపేట: పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం, పోలీసు శాఖ సర్వసన్నద్ధమయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కె.జగదీష్ అదహళ్లితో కలిసి ఎన్నికల కార్యాచరణ, భద్రతా ప్రణాళికలను వెల్లడించారు. తొలి విడతలో భాగంగా జిల్లాలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, దాచేపల్లి, గురజాల, మాచర్ల మున్సిపాలిటీల్లోని 247 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మొత్తం 3,38,294 మంది ఓటర్ల కోసం 465 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, వీటిలో 188 అత్యంత సమస్యాత్మక, 155 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని వివరించారు. మున్సిపాలిటీల్లో 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. కోర్టు కేసులు, డీలిమిటేషన్ ప్రక్రియ కారణంగా నరసరావుపేట మున్సిపాలిటీకి నవంబర్ 15 తర్వాత రెండో విడతలో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్ పూర్తయిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని, అమరావతి మండలం పరిధిలోని 13 ఎంపీటీసీ స్థానాలకు సీఆర్డీఏ విలీన ప్రతిపాదనల కారణంగా తాత్కాలికంగా ఎన్నికలు నిలిపివేసినట్లు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల కోసం 1,548 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో 706 అత్యంత సమస్యాత్మక, 488 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. జిల్లాలోని 507 గ్రామ పంచాయతీల్లోని 5,216 వార్డులకుగాను 5,270 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. వీటిలో 183 పంచాయతీలను అత్యంత సమస్యాత్మక, 150 పంచాయతీలను సమస్యాత్మక జాబితాలో చేర్చామని, సీఆర్డీఏ విలీన ప్రతిపాదనలతో అమరావతిలో 15, పెదకూరపాడులో మూడు గ్రామాలు, నరసరావుపేట మున్సిపాలిటీ విలీన పరిధిలోని 5 గ్రామాలను ఈ విడత నుంచి మినహాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం ప్రతి మున్సిపాలిటీ, మండల స్థాయిలో స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎంసీసీ టీమ్లను నియమించి, వారికి మెజిస్టీరియల్ అధికారాలు అప్పగించామన్నారు. సరిహద్దుల్లో చెక్పోస్టుల ద్వారా 24 గంటలూ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు
జిల్లా ఎస్పీ కె.జగదీష్ మాట్లాడుతూ ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా విస్తృత రక్షణ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేయడంతో పాటు వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని, పెండింగ్లో ఉన్న నాన్–బెయిలబుల్ వారెంట్లను అమలు చేస్తున్నామని వివరించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచి అదనపు పోలీస్ బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, రిసెప్షన్ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కల్పించినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయపార్టీలు, ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని కలెక్టర్, ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన వారినే బైండోవర్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆ పార్టీ నాయకుల విమర్శలను సాక్షి ప్రస్తావించగా అటువంటిదేమీలేదని, అన్నీ పార్టీల ట్రబుల్ మాంగర్లను బైండోవర్ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
తొలి విడతలో ఏడు మున్సిపాలిటీలు,
28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ,
507 పంచాయతీలకు ఎన్నికలు
సమస్యాత్మక కేంద్రాల్లో
ప్రత్యేక బలగాల మోహరింపు
రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్ల బైండోవర్
శాంతియుత ఎన్నికలకు
జిల్లా ప్రజల సహకారం అవసరం
విలేకరుల సమావేశంలో
జిల్లా కలెక్టర్, ఎస్పీ