పోలీసు దుస్తుల్లో వచ్చి దాడి చేశారు: బొల్లా
● తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో
చేరిన వైఎస్సార్‌సీపీ నేత
● పరామర్శించిన మాజీ ఎమ్మెల్యేలు
డాక్టర్ గోపిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు
● ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చేలా
పోలీసుల తీరు ఉందని ఆగ్రహం
నరసరావుపేట: ప్రజలను రక్షించాల్సిన పోలీసులే కిడ్నాపర్లుగా మారి, ముసుగులు ధరించి వైఎస్సార్‌సీపీ నాయకుడిని అపహరించి తీవ్రంగా కొట్టడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని పార్టీ నరసరావుపేట, వినుకొండ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరుకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన గణపతి అనే వైఎస్సార్‌సీపీ నాయకుడు శనివారం పశువుల మేతకు వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి కారులో వచ్చి అటకాయించి, అతనికి ముసుగు వేసి కొట్టి తీసుకెళ్లి నరసరావుపేట మండలంలోని యల్లమంద గ్రామ సమీపంలోని ఎన్‌ఈసీ కళాశాల వద్ద కిందపడేసి మళ్లీ కొట్టి వెళ్లారు. చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలలో ఉన్న గణపతిని మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ, గణపతి గ్రామంలో వినాయకుని నిమజ్జనం సందర్భంగా శుక్రవారం అన్ని ముందస్తు అనుమతులు తీసుకొని మండల కేంద్రమైన ఈపూరులో ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారన్నారు. స్టాలిన్ అనే హోంగార్డు వైఎస్సార్‌సీపీ వారు ఊరేగింపు చేసేందుకు, డీజేలు పెట్టేందుకు వీలులేదని, కాదని ఏమైనా చేస్తే అంతు చూస్తానంటూ బెదిరించాడన్నారు. ఆ బెదిరింపుల్లో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు. ప్రజలు పోలీసుస్టేషన్‌కు వెళ్లేది తమకు రక్షణ దొరుకుతుందని భావిస్తారన్నారు. కానీ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదని స్పష్టమవుతోందన్నారు. విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు చంపిన విషయం మరువకముందే గణపతిని కిడ్నాప్ చేసి కొట్టి హింసించారన్నారు. కాళ్లు, గుండెలపైకి ఎక్కి కొట్టారన్నారు. చేతిపై జగన్ అని రాసి ఉంటే ఆ చేతిపై తీవ్రంగా కొట్టారన్నారు. దుస్తులు చించేశారన్నారు. ఈ ట్రీట్‌మెంట్‌ను బట్టే ఇది పోలీసులు చేసిన పనే అని అర్థమవుతోందన్నారు. ‘అశోక్, నీ పేరు బ్యాడ్జి తీసేయ్’ అంటూ వచ్చిన వారు మాట్లాడుకోవడం గణపతి విన్నాడన్నారు. ఈపూరు పోలీసుస్టేషన్ ఎస్‌ఐ, రూరల్ సీఐ ఆదేశాలతో రైటర్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొన్నారన్నారు. ఈ విషయం చెప్పుకొనేందుకు అదనపు ఎస్పీని అపాయింట్‌మెంట్ అడిగితే తిరస్కరించారన్నారు. బాధితుడి చేత ప్రభుత్వాసుపత్రి నుంచే ఫిర్యాదు చేయిస్తున్నామన్నారు.
భయపెట్టడానికే..
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎవరూ పోటీ చేయకూడదనే భయభ్రాంతులు సృష్టించేందుకు ఈ పని చేశారన్నారు. గణపతి పార్టీ మండల కమిటీలో మెంబర్ అని, పార్టీలో చురుకుగా పనిచేస్తారన్నారు. తమ ప్రభుత్వంలో ఏ పార్టీకి అన్యాయం చేయకుండా నిమజ్జనోత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరినీ ఇబ్బందులు పెట్టలేదన్నారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ వారు ఏమీ చేయకూడదని ఆంక్షలు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారు పోలీసులైనా సరే అరెస్టు చేసి శిక్షించాలని పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ, గణపతి వైఎస్సార్‌సీపీ వీరాభిమాని అని, మండల కార్యదర్శిగా ఉన్నాడని చెప్పారు. వినాయకుని నిమజ్జనం సమయంలో ‘మేం చెప్పినట్లు వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు పాట పెట్టావు’ అంటూ దాడి చేశారన్నారు. దాడి చేసిన ముగ్గురిలో ఇద్దరు పోలీసు డ్రస్సులతోనే ఉన్నారని, ముగ్గురూ ముఖాలకు ముసుగులు ధరించారన్నారు. ముసుగు వేసి కారులో ఎక్కించుకొని కొడుతూ సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట మండలం యల్లమంద వరకు తీసుకొచ్చారన్నారు. ఆ దెబ్బలకు గణపతికి గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని చెప్పారు. స్వయంగా అదనపు ఎస్పీకి చెప్పేందుకు తాను ఫోన్ చేయగా, ఈ రోజు తనకు కుదరదని, సోమవారం కలుద్దామని చెప్పారన్నారు. పౌరులను రక్షించాల్సిన పోలీసులే ఇటువంటి దారుణమైన ఆలోచన చేస్తే వారు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఈపూరు ఎస్‌ఐ పోలీసు క్వార్టర్ పక్కనే ఒక ప్రైవేటు గది ఏర్పాటు చేసి ఎంతోమందిని తీసుకెళ్లి కొట్టి హింసిస్తున్నాడన్నారు. దీనిని ఉన్నతాధికారులు, న్యాయవాదులు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఉన్నారన్నారు. ఎమ్మెల్యేతోపాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఆదేశాలతోనే తాము గ్రామాల్లో చురుకుగా ఉన్న వారందరినీ ఇదేవిధంగా కొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నామని పోలీసులు చెబుతున్నారన్నారు. ఐదు మండలాల్లో ఎంతోమందిపై దాడి చేశారన్నారు. దాడి వెనుక పెద్దలు ఉన్నారన్నారు. జిల్లా లీగల్ విభాగ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, ఈపూరు మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.


