జిల్లా కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలు

Sep 20 2026 6:54 AM | Updated on Sep 20 2026 6:54 AM

ఈడీ ప్రకటన ప్రభుత్వానికి చెంపపెట్టు

నరసరావుపేట: నియోజకవర్గాన్ని గత ప్రభుత్వంలో తాను జిల్లా కేంద్రంగా మారిస్తే, కూటమి ప్రభుత్వంలో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు గంజాయి, వ్యభిచారానికి హెడ్‌క్వార్టర్‌గా మార్చారని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక గుంటూరు రోడ్డులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ఒకవైపు గంజాయి, మరోవైపు స్పా సెంటర్ల రూపంలో వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుందన్నారు. ఇంకొకవైపు స్వయంగా శాసనసభ్యుడి ఆసుపత్రిలో అవినీతితో జిల్లా కేంద్రాన్ని అవినీతిమయంగా మార్చారని దుయ్యబట్టారు. గంజాయి విక్రయాలు, వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. నాలుగు నెలలుగా జిల్లా ఎస్పీని నియమించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యతను చూసి స్వయంగా జిల్లా కలెక్టర్‌ పల్నాడు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని ప్రెస్‌మీట్‌ పెట్టాల్సిన దుస్థితి నెలకొందని వెల్లడించారు. ఎమ్మెల్యే హాస్పిటల్‌లో అవినీతికి పాల్పడిన ఏడుగురు పీఏలపై చర్యలు తీసుకోకపోవడంతో వారు రెచ్చిపోయి, తమను ఎవరూ ఏమీ చేయలేరని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. సీఎంఓ స్పందించాలన్నారు.

జోరుగా గంజాయి విక్రయం,

యథేచ్ఛగా వ్యభిచారం

ఎమ్మెల్యే అరవిందబాబు

తీరుతోనే ఈ దుస్థితి

జిల్లా ఎస్పీ నియామకం చేయలేని

స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం

తిరుపతి లడ్డూ వ్యవహారంలో

ఈడీ ప్రకటన సర్కార్‌కు చెంపపెట్టు

ఎమ్మెల్యే హాస్పిటల్‌లో అవినీతిపై

సీఎంఓ తక్షణమే ప్రకటన చేయాలి

విలేకరుల సమావేశంలో

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు, బాత్రూం కెమికల్స్‌ కానీ కలవలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్పష్టం చేయడం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని డాక్టర్‌ గోపిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో తిరుమల లడ్డూ ప్రసాదం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు వేశారని, ప్రజలను మోసం చేశారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఇప్పుడు ఈ తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతనవాదిగా తిరుగుతున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇదే ప్రభుత్వ పతనానికి నాంది అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు కరువుతో అల్లాడిపోతుంటే, ఇంతవరకు కరువు మండలాలను ప్రకటించలేదన్నారు. రైతు రుణాలను రీషెడ్యూల్‌ చేయలేదని, పెరిగిన ధరలతో ప్రజలు కరువుతో విలవిల్లాడుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం రాజధానిలో ఎన్ని లక్షల కోట్లు రూపాయలు పెట్టుబడులు పెడితే ఎంత కమీషన్‌ వస్తుందనే లెక్కల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ప్రజల గురించి పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదని అన్నారు. రాజధానిలో మూడవ విడత కింద 20 వేల ఎకరాలు విమానాశ్రయం కోసం సమీకరణ చేస్తున్నారని, ఇన్ని ఎకరాలు తీసుకోవడం భూగోళంలో ఎక్కడా లేదని అన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ పోస్టులను అమ్ముకున్నారని, తిరిగి వెటర్నరీ పోస్టులు కూడా అమ్ముకోబోయారని అన్నారు. ఎప్పుడైతే వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారో, వెంటనే మార్చి ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement