గార్డియన్‌షిప్‌ సర్టిఫికెట్లు త్వరగా ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

గార్డియన్‌షిప్‌ సర్టిఫికెట్లు త్వరగా ఇవ్వండి

Sep 20 2026 6:54 AM | Updated on Sep 20 2026 6:54 AM

అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు

నరసరావుపేట: అర్హులైన దివ్యాంగుల పిల్లలకు అవసరమైన సంరక్షణ, రక్షణ, సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్ల సూచించారు. గార్డియన్షిప్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీతో కలెక్టర్‌ శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గార్డియన్షిప్‌ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత కలిగిన వారికి సర్టిఫికెట్లను జారీచేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల పిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. గార్డియన్షిప్‌కు సంబంధించిన ప్రక్రియపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

చిలకలూరిపేట టౌన్‌: బాణసంచా దుకాణంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన భూమా సురేష్‌ (45) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదేప్రమాదంలో షాపు వాచ్‌మెన్‌ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్నాడు. వాచ్‌మెన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు.

తల్లిపై కొడుకు, కోడలు దాడి

మరో వ్యక్తితో కలిసి ఘాతుకం.. కేసు నమోదు

సత్తెనపల్లి: కన్నతల్లి పై దాడి చేసిన కొడుకు, కోడలు, మరో వ్యక్తి పై పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీస్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని వడవల్లి 13వ వార్డు రామ్‌నగర్‌ 4వ లైన్‌కు చెందిన కొలకలూరి రాధిక పై కుమారుడు కొలకలూరి క్రాంతి రాకేష్‌, కోడలు కొలకలూరి మానస, మరో గుర్తుతెలియని వ్యక్తి శనివారం ఇంటివద్దకు వెళ్లి తలుపులు కాలితో తన్ని, తల్లిని అసభ్యకరంగా దూషిస్తూ జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లకు ఉన్న బూట్లుతో దాడి చేయడమే కాక రాధికను కోడలు మానస మరో గుర్తుతెలియని వ్యక్తి గట్టిగా పట్టుకోగా కుమారుడు క్రాంతి రాకేష్‌ ఆమైపె కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఆ కత్తి దెబ్బ ఆమె కుడి చెవికి తగిలి తీవ్ర రక్త స్రావమైంది. అంతేకాక కుమారుడు, కోడలు, గుర్తుతెలియని వ్యక్తి ముగ్గురు కలిసి రాధికను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బంధువులు జోక్యం చేసుకొని ఆమెను రక్షించారు. వెంటనే రాధికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ముందుగా రాధిక ఇంట్లోని బీరువాను వెతికి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలు, నగదును కుమారుడు క్రాంతి రాకేష్‌, కోడలు మానస దొంగిలించి ఇంటికి తాళం వేసి పరారయ్యారని, ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాధిక పోలీసులను ఆశ్రయించింది. పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌ టీంకు సమాచారం అందించారు. పలు సెక్షన్ల కింద ముగ్గురి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ

30కి పైగా గొర్రెలు మృత్యువాత

దాచేపల్లి: గొర్రెల మందపై లారీ దూసుకెళ్లిన ఘటన శనివారం రాత్రి జరిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో 30కి పైగా గొర్రెలు మృతిచెందినట్లు సమాచారం. దాచేపల్లి వైపు నుంచి హైదరాబాద్‌కు అతివేగంగా వెళుతున్న ఓ లారీ గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో గొర్రెలు మృతిచెందాయి. వీటి విలువ సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ ఖాజావలి, ఎస్‌ఐ ఖాశిం వలిలు పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గొర్రెలు రోడ్డుపై మృతిచెంది పడి ఉండటంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు

తెనాలిరూరల్‌: తెనాలి–విజయవాడ ప్రధాన రహదారిపై నందివెలుగు సమీపంలో శనివారం ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం ప్రకారం.. తెనాలి నుంచి మంగళగిరి వైపు కారు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసున్న మహిళ కారు నడుపుతూ వస్తుండగా వేగం అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లి బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, 108 అంబులెన్‌న్స్‌కు సమాచారం అందించారు. అనంతరం మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement