ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న అల్లుడు
విషయం తెలిసి గుండెపోటుతో మామ మృతి
పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం
నరసరావుపేటలో ఘటన
ఆప్యాయంగా చూసుకునే అల్లుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న వార్త ఆ మామ గుండె తట్టుకోలేకపోయింది. అల్లుడికి ఏం జరిగిందోనన్న ఆందోళనలో ఉండగానే మామ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఒకవైపు ఆసుపత్రిలో భర్త వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతుండగా.. ఇంటివద్ద తండ్రి మృతిచెందడంతో చాంద్‌బీ కన్నీరుమున్నీరయింది. ఒకే కుటుంబంలో చోటు చేసుకున్న ఈ రెండు విషాదాలు బంధువులను, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచాయి.
నరసరావుపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడన్నా విషయం తెలుసుకొని మామ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. నరసరావుపేట పట్టణంలో శనివారం చోటుచేసుకున్న విషాద సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బాబాపేటకు చెందిన షేక్ మహబూబ్ సుభాని(48) టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. రెండవ కుమార్తె చాంద్‌బీకి సయ్యద్ ఇబ్రహీం ఖలీల్ తో 12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి 10 ఏళ్ల బాలుడు ఉన్నాడు. చాంద్‌బీ తండ్రి ఇంటిపక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని నివశిస్తూ ఉండటంతో అల్లుడు, మనవడితో సుభానికి ఎంతో అనుబంధం ఉండేది. ఇబ్రహీం ఖలీల్ ఎస్‌ఆర్‌కేటీ కాలనీ వద్ద దుకాణం ఏర్పాటు చేసుకొని లారీ మెకానిక్ పనులు చేస్తూ ఉండేవాడు. శుక్రవారం రాత్రి ఎస్‌ఆర్‌కేటీ కాలనీ సమీపంలో కర్నూలు – గుంటూరు జాతీయ రహదారి రోడ్డు దాటుతుండగా స్కూటీపై వచ్చిన వ్యక్తి ఢీకొన్నాడు. సంఘటనలో ఖలీల్ తల భాగానికి బలమైన గాయమైంది. దీంతో క్షతగాత్రుడిని స్థానికులు నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని మరో ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అల్లుడి ప్రమాద వార్త తెలుసుకున్న మహబూబ్ సుభాని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. అతన్ని కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
తండ్రి మరణం, భర్త మృత్యువుతో పోరాటం
ఒకవైపు భర్త ఖలీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. తండ్రి మృతిచెందడంతో చాంద్‌బీ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. భర్తకు ఏమవుతుందోనన్నా ఆందోళన.. అప్పటికే తండ్రిని కోల్పోయిన విషాదం.. ఈ రెండు ఘటనలతో చాంద్‌బీ కుటుంబం తీవ్ర విషాదంలోకి మునిగిపోయింది. 10 ఏళ్ల బాలుడికి తాతను కోల్పోయిన బాధతో పాటు తండ్రి పరిస్థితి తెలియని వేధన మిగిల్చింది. అల్లుడి ప్రమాద వార్త విని మామ ప్రాణాలను విడవటం స్థానికులను సైతం కలిచివేసింది. సమాచారం అందుకున్న నరసరావుపేట రూరల్ ఎస్‌ఐ కిశోర్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


