చిలకలూరిపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటుదామని మాజీ మంత్రి విడదల రజిని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చిలకలూరిపేట పట్టణ స్థాయిలో మాజీ మంత్రి విడదల రజిని నివాస ప్రాంగణంలో శనివారం నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని ప్రతి వార్డులోనూ బలోపేతం చేసే అంశంపై నాయకులు దృష్టి సారించాలని సూచించారు. రాబోయే జగన్ 2.0 పరిపాలనలో పార్టీ కోసం కష్టపడిన వారికి కచ్చితంగా ప్రాధాన్యత లభిస్తుందని వెల్లడించారు. పార్టీ అధికారంలో లేకపోయినా అండగా నిలబడి పోరాడేవారే అసలైన కార్యకర్తలని చెప్పారు. అటువంటి వారిని గుర్తించి ఐడీ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. వార్డు కౌన్సిలర్, చైర్మన్ ఎన్నికల్లో సత్తా చాటుదామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. జరగబోయే ప్రతి ఎన్నికలో మన పార్టీ అభ్యర్దుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
వైఎస్ జగన్ పాలన గుర్తు చేసుకుంటున్నారు
టీడీపీ ప్రభుత్వ పాలనలో రైతులు, విద్యార్థులు, యువత, డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్లు ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్లో కూటమి అరాచక పాలన చూసాక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి అందించిన సుపరిపాలనను గుర్తు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డులోనూ పార్టీ తరఫున ధైర్యంగా నిలబడి పోరాడి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అన్ని చోట్లా పోటీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు ఐడీ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డి, పార్టీ పట్టణ అద్యక్షుడు షేక్ దరియావలి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, జిల్లా అధికార ప్రతినిధి ఉడుతా వెంకటేశ్వరరావు, నాయకులు తాళ్ల అంజిరెడ్డి, సయ్యద్ బడే, కొండవీటి ఆంజనేయులు, గోపతోటి జాన్, వడితే కోట్యానాయక్, సయ్యద్ జమీర్, షేక్ ఖలీల్, షేక్ యూసుఫ్‌ఆలి, శివమణి దరియావలి, మైలా రాజేష్, డి బాలకోటినాయక్, తియ్యగూర అంజిరెడ్డి, మోషే, నరసింహనాయక్, సాపా సైదావలి పాల్గొన్నారు.
మాజీ మంత్రి విడదల రజిని


