ఎన్నికల్లో మున్సిపాలిటీ, పంచాయతీలను కై వసం చేసుకుంటాం నియోజకవర్గంలో 6 వేల మందికి ‘తల్లికి వందనం’ ఎగ్గొట్టారు పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి
నాసిరకం బ్యాగులు లోకేష్ పుణ్యమే
నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ సిద్ధమేనని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా మున్సిపాలిటీతో పాటు పంచాయతీలను సైతం కై వసం చేసుకుంటామని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గుడ్‌మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని ప్రకాష్‌నగర్ 14వ వార్డు కంభంపాలెం, శారదాంబ థియేటర్ వెనుకవైపు, కన్యల హాస్పిటల్ రోడ్లలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల నిర్వహణ, పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీలో సుమారు 250 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నా పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పర్యటించినా ఇక్కడి దుర్భర పరిస్థితి కనపడకపోవడం శోచనీయమని అన్నారు. ఈ వార్డులో ప్రభుత్వ పాఠశాలను రూ.25 లక్షలతో నాడు–నేడు కింద బాగు చేయించామన్నారు. టీడీపీ సర్కారు వచ్చాక నియోజకవర్గంలో విద్యుత్ బిల్లులు, పన్నుల సాకుతో సుమారు 6 వేల మందికి తల్లికి వందనం పథకం ఎగ్గొట్టిందన్నారు. ఈ ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి వారు పూటకు రూ.100 ఖర్చు చేసినా కడుపు నిండా తినే పరిస్థితి లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పార్టీ తెలుగుదేశం అన్నారు.
వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి
ఒక వైపు కరువు వచ్చి నాగార్జునసాగర్ కుడికాలువ కింద నాలుగు లక్షల ఎకరాలు సాగుకు నోచుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఆయా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, తక్షణమే అక్కడి రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ వర్కింగ్ అధ్యక్షుడు నిడమానూరి సురేంద్ర, పలు విభాగాల నాయకులు కందుల ఎజ్రా, షేక్ రెహమాన్, కొత్తూరి కిషోర్‌బాబు, షేక్ ఖాదర్ బాషా, సయ్యద్ ఖాదర్ బాషా, బూదాల కల్యాణ్, బండి వెంకటేశ్వరరెడ్డి, పాతర్ల చిన్న, కోటబాబు, మనీంద్రరెడ్డి, నాగ సుబ్రహ్మణ్యం నాయీ, నెలటూరి సురేష్‌బాబు, మిట్టపల్లి చంద్రశేఖర్, అత్తలూరి కృష్ణ, అన్నా చంద్రమోహన్, తిప్పరయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసిన నాణ్యతలేని బ్యాగులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధి, పనితీరుకు అద్దం పడుతున్నాయని డాక్టర్ గోపిరెడ్డి పేర్కొన్నారు. 14వ వార్డులో చిరిగిపోయిన స్కూల్ బ్యాగులను రైల్వే ట్రాక్ పక్కన పడేసి ఉండటాన్ని ఆయన గమనించారు. ఈ బ్యాగులను చూపిస్తూ ఆయన.. మంత్రి తీరుపై మండిపడ్డారు.


