టీడీపీ ప్రభుత్వానికి ఓటమి భయం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వానికి ఓటమి భయం

Aug 31 2026 1:44 AM | Updated on Aug 31 2026 1:44 AM

● స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు ● మాజీ ఎమ్మెల్యే బొల్లా ధ్వజం

వినుకొండ: ప్రజలకు వెన్నుపోటు పొడిచిన టీడీపీ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలంటే భయం పట్టుకుందని, గెలిచేందుకు కుట్రలకు తెరలేపిందని వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఆదివారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవ్వడంతో అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లోని పోలింగ్‌ బూత్‌లను పచ్చ నాయకుల ఇళ్ల మధ్యకు మార్చడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నీలగంగవరం, నడిగడ్డ, నరగాయపాలెం, పెరుమాళ్లపల్లి, తిమ్మాయపాలెం గ్రామాలతో పాటు, శావల్యాపురం మండలంలోని భాస్కర్‌నగర్‌, గుంటుపాలెం, కోట్లూరు, మతుకుమల్లి గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా బూత్‌లను మార్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వినుకొండ పట్టణంలో ఏకంగా 15 బూత్‌లను పెంచిన అధికారులు, వాటి వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఓటర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం

‘సర్‌’ కార్యక్రమం దారుణంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఓటర్ల అత్యంత వ్యక్తిగత సమాచారం ఉన్న ఫారాలు బహిర్గతంపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభివృద్ధి పేరుతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గత వైఎస్సార్‌సీపీ హయాంలో కట్టిన భవనాలకు శిలాఫలకాలు మారుస్తూ ‘క్రెడిట్‌ చోరీ’కి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి మారిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుకు జీడీసీసీ బ్యాంక్‌ పదవి ఇవ్వడాన్ని తప్పుబట్టారు. వినుకొండలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పగడాల వెంకటరామిరెడ్డి, ఎం.ఎన్‌. ప్రసాద్‌, కొత్తమాసు శివ, కొత్త కృష్ణారెడ్డి, మేడం జయరామిరెడ్డి, గుంజి వాసు, రోడ్డ పుల్లారెడ్డి, జెక్కిరెడ్డి వెంకటేశ్వర్‌ రెడ్డి, నూజెండ్ల ఎంపీపీ ముప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement