కౌలు రైతులకు కన్నీరే దిక్కు | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు కన్నీరే దిక్కు

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

కౌలు రైతులకు కన్నీరే దిక్కు సత్తెనపల్లి: తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించడంతోపాటు వ్యవసాయ సంబంధిత సంక్షేమ లబ్ధి కూడా అందిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందిస్తామని చంద్రబాబు అండ్‌ కో హామీలు గుప్పించారు. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయింది. తాజాగా ఈ ఏడాది కూడా ఖరీఫ్‌కు సంబంధించి పెట్టుబడి సాయం విడుదల చేసింది. అందులో కౌలు రైతులకు మాత్రం మొండిచేయి చూపింది. సర్కారు తీరుతో కౌలు రైతులు నిరాశ చెందుతున్నారు. భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులకు, దేవదాయ భూములు సాగు చేసే వారికి ఏడాదికి రూ. 20 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ నేడూ అమలు కాలేదు. భూ యజమానుల ఒప్పందం మేరకు వీరిలో కొందరికి కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ) కార్డులు సైతం ఇచ్చారు. సాయం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన లబ్ధిదారుల సంఖ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల్లో భారీగా కోత విధించింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్‌ రైతు భరోసా కింద జిల్లాలోని 2,80,181 మందికి పెట్టుబడి సాయం రూ.378.24 కోట్లు అందేది. టీడీపీ సర్కార్‌ ఆ సంఖ్యను 2,40,530 మందికి తగ్గించేసింది 39,651 మంది లబ్ధిదారులకు సాయం అందడం లేదు. దీంతో అర్హులైన రైతులు మండిపడుతున్నారు. కొత్తగా వేలాది మంది దరఖాస్తు చేసినా సాయం అందించిన దాఖలాలు లేవు. ఈ రెండేళ్లలో వారసత్వంగా, భూములు కొనుగోలు చేయడం ద్వారా అనేకమంది భూ యజమానులుగా నమోదయ్యారు. గతంలో వివిధ కారణాల వల్ల అనేకమందికి సాయం అందలేదు. సమస్యలు పరిష్కరించినా ఈ ఏడాది వారికి కూడా సాయం అందలేదు.

జిల్లాలో 2.80 లక్షల మందికిపైగా రైతులు...

జిల్లాలో భూ యజమానుల కంటే కౌలు రైతులు కీలకంగా ఉన్నారు. 28 మండలాల్లో 2.80 లక్షల మందికిపైగా అన్నదాతలు ఉన్నారు. వీరిలో పీఎం కిసాన్‌ పథకం కింద లబ్ధి పొందుతున్న వారు దాదాపు 1.93 లక్షల మందికిపైగా ఉన్నారు. సాగుపై ఆధారపడిన కౌలు రైతులకు ప్రభుత్వం సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగానే 2011లో కౌలు రైతుల చట్టం వచ్చింది. 2019లో ఆ చట్టాన్ని సవరిస్తూ భూ యజమానుల అంగీకారంతోనే కౌలు కార్డులు ఇవ్వాలని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. రైతులందరికీ సంక్షేమ పథకాలు అందాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. నూతన చట్టం తెచ్చి కౌలు రైతులను ఆదుకోనున్నట్లు ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక భిన్నంగా వ్యవహరిస్తూ కౌలు రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టింది. అన్నదాత సుఖీభవ కింద ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2,40,530 మందికి అందిస్తున్నట్లు లింగంగుంట్ల సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. సదరు రైతుల ఖాతాలకు పీఎం కిసాన్‌ ద్వారా కేంద్రం నుంచి రూ.38.75 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్రం నుంచి రూ.120.26 కోట్లు వంతున మొత్తం రూ.159.01 కోట్లు జమ కానున్నాయి.

తప్పని అప్పుల భారం

సాగు కోసం అప్పులు చేసిన కౌలు రైతులు పెట్టుబడుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడంతో సాగు వ్యయం మరింత పెరిగిందని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి సాయం అందకపోవడంతో ప్రైవేట్‌ అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే వరకు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని వాపోతున్నారు. బ్యాంకు రుణాలలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. వ్యవసాయంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయాలపై ఆశలు పెట్టుకున్నాయి. వెంటనే కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

పెట్టుబడి సహాయానికి ఎగనామం

2,40,530 మందికే నగదు జమ

39,651 మందికి అందని సాయం

కనికరం కూడా చూపని

చంద్రబాబు సర్కార్‌

అప్పుల పాలవుతున్న కౌలు రైతులు

రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులను రెండేళ్లుగా కన్నీరే మిగిల్చింది. వ్యవసాయమే జీవనాధారమై భూ యజమానుల నుంచి కౌలుకు తీసుకున్న భూమిలో రెక్కల కష్టాన్ని నమ్మి సేద్యం చేసే వారిపై కనికరం కూడా చూపడం లేదు. ‘అన్నదాత సుఖీభవ’ కింద మొండిచేయి చూపుతోంది. రెండేళ్లుగా ఆశగా చూస్తున్న కౌలు రైతులకు అన్యాయం చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement