మంగళగిరి రూరల్: పలు జిల్లాల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 22 గ్రాముల బంగారం, 122 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పీనారిపాలెంకు చెందిన చిటికెల నాగేశ్వరరావు (35), విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురానికి చెందిన కేసంశెట్టి సోమేశ్వరరావు అలియాస్ సోమేష్ (45)పై మంగళగిరి రూరల్, అనంతపురం జిల్లా పుట్లూరు, అనంతపురం త్రీ టౌన్, విశాఖపట్నం జిల్లా దువ్వాడ పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనం కేసులు నమోదయ్యాయి. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఏపూరి దీప్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆమె కుటుంబ సభ్యులు విధుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బీరువాను పగులగొట్టి వెండి గ్లాసులు, గిన్నెలు, పట్టీలు, నగదు రూ.50 వేల నగదును చోరీ చేశారు. నిందితులు విశాఖపట్నం జైలులో పరిచయం ఏర్పరచుకుని, అనంతరం పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం, విశాఖపట్నం జిల్లా దువ్వాడ, అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్, పుట్లూరు మండలం నారాయణ రెడ్డిపల్లిలోని దేవాలయంలో జరిగిన చోరీల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మంగళగిరి రూరల్ ఎస్‌ఐ ఆర్. నవీన్ నాయక్ నేతృత్వంలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు 22 గ్రాముల బంగారం, 122 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ కేసు దర్యాప్తులో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి. వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఆర్. నవీన్ నాయక్, హెచ్‌సీలు శ్యామ్, చలంరావు, పీసీలు సాగర్, శామ్యూల్ తదితరులు పాలుపంచుకున్నారు.
22 గ్రాముల బంగారం,
122 గ్రాముల వెండి స్వాధీనం


