● తెలంగాణ తెలుగు కాంగ్రెస్
ప్రభుత్వం కారణంగానే బొల్లాపై కేసు
● మీడియా సమావేశంలో పేర్ని నానితో
పాటు డాక్టర్ గోపిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి,
బాసు లింగారెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి
● అక్రమ కేసులో బెయిలుపై వచ్చిన
మాజీ ఎమ్మెల్యే బొల్లాకు పరామర్శ
నరసరావుపేట: తప్పుడు కేసులతో వైఎస్సార్‌సీపీ నాయకులు, బొల్లా బ్రహ్మనాయుడును ఆపలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ మంత్రులు, ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లోని స్వగృహంలో ఉన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ నియోజకవర్గ పరిశీలకుడు బాసు లింగారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డిలతో కలసి ఆయన పరామర్శించారు. హైదరాబాద్ భూమి విషయంలో నమోదైన అక్రమ కేసు గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీతోపాటు తామందరం అండగా ఉంటామని, అందరం కలసి వెన్నుపోటు పార్టీకి తగిన గుణపాఠం చెబుదామని తెలిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా బొల్లాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిందని చెప్పారు. తెలంగాణ రెవెన్యూ అధికారి నివేదిక, పోలీసు ఎఫ్‌ఐఆర్‌లలో బొల్లా పేరు లేకపోయినప్పటికీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పదిరోజుల ముందే తప్పకుండా బొల్లాను అరెస్టు చేస్తారని విలేకర్లు, పార్టీ సమావేశాల్లో చెప్పటాన్ని ప్రస్తావించారు. దీనిని బట్టి తెలంగాణలో తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వమే నడుస్తున్న విషయం తేటతెల్లం అవుతోందన్నారు. ఈ రెండు ప్రభుత్వాల మధ్య పవర్‌షేరింగ్‌లో లాలూచీ ఉందన్నారు. వీరు ఎక్కడైనా తప్పుడు కేసులు పెట్టగలరన్నారు.
అంతా పారదర్శకమే...
బ్రహ్మనాయుడు బ్యాంకు ద్వారా తన రూ.2 కోట్ల తెల్లధనాన్ని సోదరుడు రమేష్ కోరికపై తెలంగాణకు చెందిన ఇద్దరు, ముగ్గురు రైతులకు ట్రాన్స్‌ఫర్ చేయటమే నేరమైందన్నారు. ఇందులో భూ వ్యవహారాల లావాదేవీలకోసం ఆ ప్రభుత్వం నిర్వహించే భూ భారతి ఖాతాకు డీడీలు ఇవ్వటాన్ని ఆ ప్రభుత్వం విచారణ చేయాల్సి ఉందన్నారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ను బ్రహ్మనాయుడు కుమారుడు కలసి జీఓలు ఇచ్చి వాస్తవమా.. కాదా... చెప్పాలంటూ కోరగా ఆయన వాటిని తహసీల్దార్‌కు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశించారన్నారు. ఆ విచారణలో ఇవి దొంగ జీఓలు అంటూ నివేదిక ఇచ్చినా ఆ దొంగ జీఓలు సృష్టించిన వ్యక్తులపైనా, భూ భారతి అంటూ ఖాతా సృష్టించిన వ్యక్తులపైనా ఎటువంటి కేసులు నమోదు చేయలేదన్నారు. డబ్బులు పోగొట్టుకున్న బ్రహ్మనాయుడు, ఆయన సోదరుడు నేరస్తులుగా కేసు నమోదు చేయటమే పెద్ద ట్విస్టుగా చెప్పవచ్చన్నారు. ఈ రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో హెరిటేజ్ పాలవ్యాపారం ఎందుకు విస్తరించావని బొల్లా ఏనాడూ ముఖ్యమంత్రి చంద్రబాబును అడగలేదన్నారు. బొల్లా నల్లడబ్బుతో ఎక్కడా వ్యాపారాలు చేయలేదని పేర్కొన్నారు. నిజం నిలకడమీద తేలుతుందన్నారు. చంద్రబాబు జైలులో ఎన్నిరోజులు ఉన్నారో గుర్తు చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో నారా లోకేష్ పెద్దమ్మను పట్టుకొని తన తండ్రికి కిడ్నీలు, గుండె చెడిపోయిందని, ఆరోగ్యం బాగాలేదని బెయిలు తెచ్చుకున్నారని చెప్పారు. బొల్లా 14 రోజులపాటు రిమాండ్‌లో ఉండి నిఖార్సయిన నేతగా పోరాడి బెయిలుపై బయటకు వచ్చారన్నారు. రాబోయే రోజుల్లో కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. తప్పుడు కేసు పెట్టి వైఎస్సార్‌సీపీ తరఫున వినుకొండ నుంచి పోటీ చేయకుండా ఆపలేరన్నారు. గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారని అన్నారు. చంద్రబాబు తన పలుకుబడితో ఏ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టించినా ఎవరూ పోటీచేయకుండా ఆగరని వెల్లడించారు. జిల్లా అధికార ప్రతినిధి, న్యాయవాది ఎం.ఎన్.ప్రసాదు, పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు.


