టెక్నాలజీతో పాటు నైతికత, మానవత్వం అవసరం
చేబ్రోలు: న్యాయ, పాలనా వ్యవస్థలు ప్రజల అంచనాలకు తగిన విధంగా పనిచేయాలంటే టెక్నాలజీతో పాటు నైతికత, మానవత్వం కూడా అంతే అవసరమని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రో బోనో లీగల్ సర్వీసెస్ సహకారంతో ‘‘కృత్రిమ మేధస్సు–సాంకేతిక యుగంలో న్యాయ సహాయం– న్యాయం అందుబాటులోకి తేవడం’’ అనే అంశంపై ఒక రోజు అంతర్జాతీయ సదస్సు శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముందుగా యూనివర్సిటీలోని ఎన్‌టీఆర్ లైబ్రరీలో తన పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెక్షన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఏఐ, టెక్నాలజీ న్యాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నప్పటికీ, అవి ఎప్పటికీ న్యాయవాదులు లేదా న్యాయమూర్తుల స్థానాన్ని భర్తీ చేయలేవని స్పష్టం చేశారు. న్యాయం అంటే కేవలం చట్టపరమైన అర్థమే కాదు.. అది మానవ మనసు, దయ, సమానత్వం, బాధ్యతల సమ్మేళనం అన్నారు. పేద వర్గాలకు న్యాయ సహాయం చేరేలా అవగాహన కార్యక్రమాలు, సులభ న్యాయసేవలు, డిజిటల్ సదుపాయాలు విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు. ఏఐ, ఆన్‌లైన్ వివాద పరిష్కార వేదికలు న్యాయ ప్రవేశాన్ని విస్తరించగలవని తెలిపారు. టెక్నాలజీ మానవ తీర్పుకు సహాయకంగా ఉండాలి గానీ, దాని స్థానంలోకి రాకూడదని స్పష్టం చేశారు. 2050 నాటికి బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు రంగాల్లో ఊహించలేని అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ టెక్నాలజీ శక్తివంతమైన సాధనమే గానీ దాని విలువ మానవ సేవలోనే ఉందని చెప్పారు. భారత న్యాయవ్యవస్థ వేగంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఏఐ, డిజిటల్ సాధనాలు కేవలం సంస్థల సమర్థతకే కాకుండా, ప్రజలకు సహాయకారిగా, సమాన న్యాయం సాధనానికి దోహదపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చాన్స్‌లర్ పి. నాగభూషణ్, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
జస్టిస్ జాస్తి చలమేశ్వర్


