ఆదాయ పన్ను శాఖ అధికారినని బెదిరిస్తున్న వ్యక్తి అరెస్టు
చిలకలూరిపేట: ఆదాయ పన్ను శాఖ అధికారిని అని చెప్పి వ్యాపారస్తులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని చిలకలూరిపేట పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అర్బన్ సీఐ పి రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నగరం ఆర్టీసీ కాలనీకి చెందిన చదలవాడ తిరుమలరెడ్డి ఆన్‌లైన్‌లో వివిధ వ్యాపారాలకు చెందిన వ్యక్తుల వివరాలు సేకరిస్తాడు. వారికి ఫోన్ చేసి తాను ఆదాయ పన్ను శాఖ అధికారినని, మీ మీద అధికారులు రైడ్ చేయనున్నారని, అకౌంట్ పుస్తకాలు తనిఖీ చేస్తారని వివరిస్తాడు. అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలని, రైడ్‌కు వచ్చిన సమయంలో ఫైల్ సరిగా లేకపోతే సెటిల్‌మెంట్ చేసుకోవాల్సి వస్తుందని, మేము అడిగిన మొత్తం చెల్లించని పక్షంలో ఆస్తులు సీజ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తాడు. ఈ నేపథ్యంలో ఇతనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణంలోని ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఒక మోటార్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై తూర్పు గోదావరి జిల్లా తుని, పట్టణ పోలీస్‌స్టేషన్, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో రెండు కేసులు, విశాఖపట్నం ఒకటో పట్టణ పీఎస్‌లో, సూర్యాపేట, విజయనగరం జిల్లా రాజాం పోలీసుస్టేషన్, పాత గుంటూరుతోపాటు చిలకలూరిపేటలో కలిపి ఎనిమిది కేసులు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐలు డి చెన్నకేశవులు, పి హజరతయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
పలు పోలీస్‌స్టేషన్లలో ఎనిమిది కేసులు


