
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా
చిలకలూరిపేటటౌన్: బాల్యంపై ఉన్నం మమకారమే తనను బాల సాహిత్యకారుడిగా తీర్చిదిద్దిందని ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కవికోకిల గుర్రం జాషువా వర్ధంతి గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సత్యాలను కవిత్వంతో మేళవించి, సమాజోద్ధరణకు పూనుకున్న గొప్ప కవి, నవయుగ కవిచక్రవర్తి జాషువా అని అభివర్ణించారు. సమాజంపై జాషువా విసిరిన కవిత్వం దళిత జాతిని జాగృతం చేసి అగ్రపీఠంపై నిలబెట్టిందన్నారు. తనకు సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన ‘కబుర్ల దేవత’ పుస్తకంలోని విశేషాలను ఆయన వివరించారు.
● విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు అజయ్ బాబు మాట్లాడుతూ దళితుల ఆక్రందనలు, ఆకలి కేకలు కవిత్వీకరించి, అనాథలను, అభాగ్యులను కవితా వస్తువులుగా ఎన్నుకుని సమాజాన్ని ధిక్కరించిన కవిదిగ్గజం జాషువా అని కొనియాడారు. విశ్రాంత ఎకై ్సజ్ సీఐ గోరంట్ల నారాయణ జాషువా పద్యాలు హృద్యంగా ఆలపించారు. జాషువా వర్ధంతిపై విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథులు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేయగా, సొసైటీ ప్రతినిధులు శివకుమార్‌ను ఘనంగా సత్కరించారు. ముందుగా పట్టణ ప్రముఖులు తోట రామచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాహితీ విమర్శకులు డాక్టర్ పీవీ సుబ్బారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గేరా యాకోబు, సలహాదారులు న్యాయవాది దాసరి చిట్టిబాబు, దార్ల బుజ్జిబాబు, చుక్కా విన్సెంట్ పాల్, దారా కొండయ్య, బొప్పుడి వెంకటేశ్వర్లు, తంగళ్ళ సుధాకర హరిప్రసాద్, జనక్రాంతి షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సత్యాలను కవిత్వంతో మేళవించిన గొప్ప కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్