
అసమానతల నిర్మూలనకే జాషువా రచనలు
తెనాలి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సమాజంలోని అసమానతల తొలగింపు కోసం రచనలు చేశారని, తన సాహిత్యంతో సమాజ చైతన్యానికి కృషిచేశారని ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పీజీఎం కొండముది సుధీర్ బాబు అన్నారు. ఆయన సాహిత్యాన్ని ముందు తరాలకు అందించటానికి తగిన కృషి జరగాలని అభిప్రాయపడ్డారు.పట్టణానికి చెందిన గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా 54వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర్లోని విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి సమితి ప్రధాన కార్యదర్శి, యునెస్కో అవార్డు గ్రహీత పినపాటి రవికుమార్ అధ్యక్షత వహించారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ జాషువా సాహిత్యం ఆనాటి కాలంలో సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిందని తెలిపారు. అంటరానితనాన్ని పారద్రోలడంలో కీలక భూమిక పోషించిందని చెప్పారు. జాషువా కారణజన్ముడని ఆయన పేర్కొన్నారు. దళిత వర్గాల్లో పుట్టిన జాషువా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రచనలు చేసి విశ్వక్ కవిగా ఖ్యాతిగాంచిన తీరు గొప్పదని ప్రశంసించారు. సమితి ఉపాధ్యక్షుడు వేజండ్ల రత్నం, కొండముది రమేష్, న్యాయవాదులు ఇందుపల్లి రాజారామ్, ఆరుమళ్ల శ్రీనివాసరావు, బొబ్బిలిపాటి ప్రసాద్, వేజండ్ల శ్రీనివాస్, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, కళాకారులు, రచయితలు అయినాల మల్లేశ్వరరావు, అబ్దుల్ హకీం జాని, చోడవరపు భాస్కరరావు, ఆర్ అండ్ బీ రాజు, వేజెండ్ల శ్రీనివాసరావు, రావూరి ప్రేమ్‌కుమార్, జయరావు, అత్తోట శ్యామ్, సిద్ధల కమలాకర్ రావు, కనపర్తి డేవిడ్, విన్సెంట్ కుమార్, శ్రీనివాసరావు, పి. అశోక్ కుమార్, రావూరి బాలరాజ్ పాల్గొన్నారు. తొలుత జాషువా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పీజీఎం కొండముది సుధీర్ బాబు