
వివాహితను రక్షించిన పోలీసులు
యడ్లపాడు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహితను యడ్లపాడు పోలీసులు సకాలంలో స్పందించి కాపాడిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన సురేష్ ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేశారు. తన సోదరి వైవాహిక సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసుకోబోతున్నట్లు పేర్కొంటూ, రక్షించాలని కోరారు. సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్‌ఐ టి. శివరామకృష్ణ వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు యువతితో వీడియో కాల్‌లో మాట్లాడి నచ్చజెప్పారు. తాను జీవితంపై విరక్తి చెందానని, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎస్‌ఐ ఆమె మొబైల్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేసి యువతి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తక్కెళ్ళపాడు గ్రామ శివారులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కారులో అక్కడికి వెళ్లి ఆమెను బుజ్జగించి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించి, జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ డయల్ 100, అలాగే శక్తి మొబైల్ యాప్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు. క్షణికావేశంలో జరిగే అనర్థాలను, ప్రమాదాలను వీటి ద్వారా అడ్డుకోవచ్చన్నారు.