రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
సత్తెనపల్లి: దేశంలో యుద్ధం జరుగుతుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన అమలు చేస్తోందని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలంతా ఉగ్రవాదులను మట్టుపెట్టాలన్న సంకల్పంతో రక్షణ బలగాలకు సంఘీభావం తెలిపితే.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలి.. ఎలా కక్షలు తీర్చుకోవాలనే దానిపై దృష్టి పెట్టాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూసి ఉండమని తెలిపారు. లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి అబద్ధాలను ఆరోపణలుగా మార్చి, దాని చుట్టూ కక్ష తీర్చుకునే క్రమంలో ఓ వైపు జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కనుక కొన్నాళ్లపాటు ఆటలు చెల్లుతాయని, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఇవాళ కాకపోయినా రేపైనా నిజాలేంటో బయటపడతాయని, చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ప్రజలు మాత్రం క్షమించరన్నారు. మాజీ మంత్రి రజినీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, శ్రీకాంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసేందుకు చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు దౌర్జన్యంగా వ్యవహరించాడని ధ్వజమెత్తారు. చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న పద్ధతిని కూడా పోలీసులు పాటించలేదని, ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో తప్పకుండా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చట్టం చెబుతోందని వెల్లడించారు. కంతేరులోనూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ కల్పన అనే దళిత మహిళను వేకువజామున మూడు గంటల సమయంలో 20 మంది పోలీసులు దౌర్జన్యంగా వెళ్లి అరెస్టు చేశారన్నారు.దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భార్గవ్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కర్రి భాస్కర్, వైఎస్సార్ సీపీ మహిళా కార్యకర్త మహాలక్ష్మి, ఆమె కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజలు వీటన్నిటిని గమనిస్తు న్నారని, తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు షేక్ నాగూర్ మీరాన్, రమావత్ కోటేశ్వరరావు నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, నాయకులు రాజవరపు శివ నాగేశ్వరరావు, కళ్లం విజయభాస్కర్ రెడ్డి, చిలుకా జైపాల్, అచ్యుత శివప్రసాద్, లోకా మాధవ, బండి మల్లికార్జునరెడ్డి, కొర్లకుంట వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సుభాని, షేక్ నాగూర్ బాషా పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భారవ్‌రెడ్డి మాజీ మంత్రి రజినీని తోసివేయడం, శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమం కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక


