న్యూస్‌రీల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన
నషా ముక్త్ యువ’ కార్యక్రమంలో గవర్నర్ తదితర ప్రముఖులు
జాతీయ సంకల్పానికి జత కలుద్దాం: గవర్నర్
భువనేశ్వర్: మాదక ద్రవ్య రహిత భారత్ కోసం యువత చోదక శక్తిగా మారాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆదివారం పిలుపునిచ్చారు. కళింగ స్టేడియంలో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన ‘విశిష్ట భారత్ అవగాహన, యువత సాధికారత ప్రచారం కోసం నషా ముక్త్ యువ’ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. మాదక ద్రవ్య రహిత భారత దేశం నిర్మాణం జాతీయ సంకల్పానికి ఈ కార్యక్రమం నాంది అని గవర్నర్ అభివర్ణించారు. యువత మాదక ద్రవ్యాలను దూరం చేసి మత్తు రహిత సమాజం ఆవిష్కర్తలుగా నిలవాలని కోరారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత దేశం లక్ష్యాన్ని సాధించడంలో ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన, దృఢ సంకల్పం గల యువతరం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనం నిశ్శబ్దంగా కలలను నాశనం చేసి విచక్షణను బలహీనపరుస్తుందని, యువతకు అవకాశాలను దూరం చేస్తుందని గవర్నర్ హెచ్చరించారు. వ్యసనం కలిగిన వ్యక్తులకు హాని కలిగించడమే కాకుండా కుటుంబాలకు మానసిక, ఆర్థిక క్షోభను కలిగించి దేశం ఉత్పాదక పౌరులను కోల్పోయేలా చేస్తుందని తెలిపారు.
యువత ఆరోగ్యకరమైన, సార్థకమైన జీవితాలను గడపాలని ప్రోత్సహిస్తూ, క్రీడలు, ఫిట్‌నెస్, యోగా, సంస్కృతి, ఆవిష్కరణలు, స్వచ్ఛంద సేవను స్వీకరించాలని డాక్టర్ కంభంపాటి కోరారు. ఒడిశా అగ్రగామి క్రీడా రాష్ట్రంగా ఆవిర్భవించడాన్ని ప్రస్తావిస్తూ యువత మాదక ద్రవ్యాలకు బదులుగా క్రీడా మైదానాలను, వ్యసనానికి బదులుగా తరగతి గదులను, ఆత్మ విధ్వంసానికి బదులుగా సేవను ఎంచుకోవాలని ఆయన ప్రబోధించారు. ఈ ప్రచారానికి ప్రతి ఒక్కరూ మార్గదర్శకులు కావాలని కోరుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, చైతన్యం, కరుణ, బాధ్యత అనే సందేశాలను వ్యాప్తి చేస్తూ ఈ ప్రచారాన్ని ఒక నిజమైన ప్రజా ఉద్యమంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేయాలని గవర్నర్ ప్రోత్సహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సేవన వ్యక్తులు, కుటుంబాలు, సమాజాన్ని ప్రభావితం చేసే ఒక ప్రధాన సామాజిక, ఆర్థిక సవాలుగా మారింది. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, నార్కోటిక్స్ సిండికేట్‌లపై ఒడిశా ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని పునరుద్ఘాటించారు. క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి సూర్యబన్షీ సూరజ్ ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన, అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణానికి దోహదపడాలని యువతను కోరారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.


