● ఇంఫా కర్మాగారంలో కీలక సమావేశం
రాయగడ: జిల్లా పరిధిలోని కొలనార సమితి తెరువలి ప్రాంతంలో ఉన్న ఇండియన్ మెటల్సఅండ్ ఫెర్రో ఎల్లాయిస్ (ఇంఫా ) కర్మాగారాన్ని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కుమారుడు కరణ్ అదానీలు ఆదివారం హెలీకాప్టర్‌లో సందర్శించారు. కర్మాగారంలో సుమారు గంటపాటు జరిగిన కీలక సమావేశంలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనతో రాయగడ జిల్లాలో పారిశ్రామిక రంగానికి సంబంధించి కొత్త పరిణామాలపై చర్చ మొదలైంది. ఇప్పటికే కాసీపూర్ సమితిలో బాకై ్సట్ గనుల లీజు ఆదానీ గ్రూప్‌కు లభించగా కళింగ అల్యూమినియం లిమిటెడ్ పేరుతో రాయగడలో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. గతంలో కొలనార సమితిలొ సుమారు 1700 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన వచ్చినప్పటికీ, ప్రభుత్వ భూమి కంటే ప్రైవేట్ భూమి ఎక్కువగా ఉండటంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇక కేంద్రాపడ ఎంపీ, ఇంఫా కర్మాగారం యజమాని బైజయంత్ పండ ఆధ్వర్యంలో ఇంఫా ప్లాంట్‌లో జరిగిన సమావేశం స్ధానికంగా ఆసకి రేకెత్తిస్తొంది. భవిష్యత్‌లో ఇంఫా సంస్థను అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకుంటుందా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సమావేశం సందర్భంగా మీడియాకు అనుమితి ఇవ్వకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, జిల్లా ఎస్పీ రాజ్ ప్రసాద్ తదితర అధికారులు సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు. అదానీ గ్రూప్ హెలీకాప్టర్‌లో కాసీపూర్ సమితితోపాటు జిల్లాలోని పలు ప్రాంతాలను గగనతల వీక్షణ చేసినట్లు సమాచారం.


