తరించిన భక్తజనం
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కల్యాణవేంకటేశ్వర మందిరంలో జరుగుతున్న మందిర వార్షికోత్సవంతో పాటు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి మోహిని అవతారంల్లో స్వామివారు భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. రంగురంగుల పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాల వెలుగులు, మంగళ వాయిద్యాల నడుమ మందిర ప్రాంగణం భక్తి పారవశ్యంతో కళకళలాడింది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు మందిరానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలను నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. క్షీర సాగర మథన సమయంలో అమృతాన్ని దేవతలకు అందించేందుకు మహావిష్ణువు ధరించిన మోహిని అవతారాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శేష వాహనం, గజవాహనంపై స్వామి వారు ఊరేగించారు. మందిరం సేవా కమిటీకి చెందిన మహిళలు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. అంతకుముందు స్వామి వారి సన్నిధిలో శాత్తుమురై పూజలను వేదపండితులు నిర్వహించారు. అలాగే హయగ్రీవ హోమం చేపట్టారు. కార్యక్రమాల్లో మందిర పరిచాలన కమిటీ అధ్యక్షులు చంద్రమౌలి కుముంధాన్ దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలొ పాల్గొన్నారు.


