పిడుగుపాటుకు తల్లీకూతుళ్లు మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు తల్లీకూతుళ్లు మృతి

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

కొరాపుట్‌: పిడుగు పాటుకి తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఆదివారం నబరంగ్‌పూర్‌ జిల్లా ఉమ్మర్‌కోట్‌ డివిజన్‌ రాయిఘర్‌ సమితి ముండాబెడా గ్రామ పంచాయతీ నినాష్పనీ గ్రామంలో పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. ఇదే సమయంలో పువ్వులు కోయడానికి తల్లి దైమతి ముదలి (60), కుమార్తె చంపా ముదలి (30) వెళ్లారు. ఇదే సమయంలో వర్షం నుంచి రక్షించుకోవడానికి సమీప వృక్షం కిందకు చేరారు. ఆ సమయంలో పిడుగు పడడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునే సరికే వారిద్దరు మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నేడు మజ్జిగౌరి అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు

రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు సోమవారం చేపట్టనున్నట్లు ఆలయ పరిచాలన కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి తహసీల్దార్‌, ఎండొమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌, మందిర పరిచాలన కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మందిరం సూపరింటెండెంట్ల సమక్షంలో హుండీలను తెరుస్తారు. అనంతరం లెక్కింపు కార్యక్రమాన్ని చేపడతారు. పూర్తి పోలీస్‌ బందోబస్తు మధ్య జరిగే ఈ లెక్కింపులో సహకరించేందుకు శ్రీకళ్యాణవేంకటేశ్వర మందిరం సేవా కమిటీ సభ్యులు, సాయి సేవా సమితి సభ్యులు పాల్గొంటారు. హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం సుమారు 11 గంటల సమయం పడుతుంది. అనంతరం పూర్తి వివరాలను కమిటి తెలియజేస్తుందని పేర్కొన్నారు.

పునః మూల్యాంకనంతో టాపర్లలో స్థానం

భువనేశ్వర్‌: జవాబు పత్రాల పునః మూల్యాంకనం అనంతరం కటక్‌లోని సాయి ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు చెందిన ఒక విద్యార్థిని కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) ఈ ఏడాది నిర్వహించిన 12వ తరగతి బోర్డ్‌ పరీక్షలో ప్రాంతీయ టాపర్లలో ఒకరిగా నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన హ్యుమానిటీస్‌ విభాగం విద్యార్థిని సౌమిలి మైత్రా పునః మూల్యాంకనం తర్వాత 99.2 శాతం మార్కులు సాధించి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతీయ పరిధిలో టాపర్లలో స్థానం సంపాదించి సంచలనం రేపింది. సౌమిలి విజయం ఆమె కృషికి, పట్టుదలకు నిదర్శనం. ఇది తోటి విద్యార్థులను విద్యాపరంగా ఉన్నత ప్రమాణాలను సాధించడానికి ప్రేరేపిస్తుందని సర్వత్రా ప్రశంసలు అందుకుంది.

22 కింగ్‌ కోబ్రా పిల్లలు లభ్యం

కొరాపుట్‌: ఒకే చోట 22 కింగ్‌ కోబ్రా పిల్లలు లభ్యం అయ్యాయి. కొరాపుట్‌ జిల్లా సునాబెడా పట్టణంలో టైప్‌ సీ కాలనీలో స్థానికులు పాము పిల్లల కదలికలు గమనించారు. వెంటనే అగ్ని మాపక, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అదే సమయంలో స్నేక్‌ హెల్ప్‌ లైన్‌ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. వారు నేర్పుగా ఆ ప్రాంతం గాలించగా 22 పాము పిల్లలు సేకరించారు. వాటిని నేర్పుగా ఒక బకెట్‌ లో వేసి భద్ర పరిచారు. అటవీ శాఖ సిబ్బంది వాటిని సురక్షిత ప్రాంతంలో విడిచి పెడతామని ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement