మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి గుంటాబేడ, కదంగూఢ గ్రామాల అటటీ ప్రాంతంలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను పోలీసులు ఆదివారం ఉదయం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డీవీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహించడం కోసం శనివారం అడవుల్లోకి వెళ్లి ఆదివారం తెల్లవారుజామున వస్తున్న సమయంలో డంప్ వారికి తారసపడింది. దీంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీలు, వాకీటాకీలు, ఇతర వస్తువులు ఉన్నట్టు గుర్తించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఉదయం 11 గంటల సమయంలో ఎస్పీ వినోద్ పటేల్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ డంప్‌ను భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకొని మావోలు దాచినట్టు అనుమానం వ్యక్తం చేశారు. లభ్యమైన డండ్‌లో రెండు ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీలు, రెండు నాటు తుపాకీలు, ఒక మ్యాగజైన్ లేని పిస్టల్ (అమెరికా తయ్యారీ), ఒక 303 బారెల్ గన్, రెండు కేజీల ఐఈడీ ఒకటి, ఐదు కిలోల ఐఈడీ ఒకటి, ఒక కై ్లమోర్ గన్, ఐదు బుల్లెట్లు, ఏడు వాకీటాకీలు, మూడు వాకీటాకీల చార్జర్లు, మూడు వాకీటాకీ బ్యాటరీలు, రెండు వాకీ యాంటీనాలు, వైర్‌తో ఎంసీపీ స్విచ్ నాలుగు మీటర్లు, లోహపు పైపులు ఐదు, కరెంట్ వైరు, చార్జర్, కొంతమందుగుండ సామగ్రి, 45 పెన్‌డ్రైవ్‌లు, ఒక హర్డ్‌డిస్క్, పవర్‌బ్యాంక్, ముబైల్ బ్యాటరీ, 80 లీటర్ల డ్రమ్, మందుల కిట్, కీబోర్డ్, పది మీటర్ల జీఐ పైపు, గొడుగులు, విప్లవ సాహిత్యం ఉన్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఈ నెలలో రెండు మావోయిస్టుల డంప్‌లను స్వాధీనం చేసుకోవడం జవాన్లు సాధించిన విజయంగా చెప్పారు. ఈ డంప్ ఆంధ్రా–ఒడిశా కెడార్ మావోయిస్టులకు చెందినదిగా గుర్తించామన్నారు. ఎస్పీ వినోద్ పటేల్, అలాగే జవాన్లు, కేంద్ర హోమ్‌శాఖ విధించిన తేదీ నాటికి జిల్లాను మావో రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు.


