భువనేశ్వర్: ట్రాఫిక్ నిర్వహణ కోసం అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అమలు కానుంది. నగర ప్రాంతాల్లో ప్రధానంగా జంట నగరాల్లో అత్యంత శక్తివంతమైన కృత్రిమ మేధస్సు (ఏఐ) కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో కటక్ నగరంలో ఎంపిక చేసిన కీలక ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిఘా ఉంచడానికి ఈ వ్యవస్థ పటిష్టంగా దోహదపడుతుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భువనేశ్వర్ కంట్రోల్ రూమ్ నుండి కెమెరా వ్యవస్థ ద్వారా నేరుగా ఇ–చలాన్ జారీ చేస్తారు. పోలీసులు ఇకపై సంప్రదాయ రీతిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటోలను తీయాల్సిన అవసరం లేదు. అధునాతన ఏఐ కెమెరాలు ఉల్లంఘన దృశ్యాలను తక్షణమే బంధించి వాస్తవ వేళ, తేదీ, స్టాంప్‌తో సంబంధిత వాహన చోదకుని మొబైల్ ఫోనుకు ఎస్‌ఎంఎస్ ప్రసారం చేసి ఇ–చలాన్ జారీ చేస్తుంది. కటక్ నగరంలో 22 అత్యంత రద్దీ ప్రాంతాలైన మధుపట్న, బాదంబాడి, రాణీ హాట్, కాలేజ్ స్క్వేర్, ఓఎంపీ, సతీ చౌరా, బజ్రక్ బాటి, బక్సీ బజార్, ఎస్పీ ఆఫీస్ ఛక్, బెల్ వ్యూ చక్, ప్రెస్ చక్, జోబ్రా బ్యారేజ్ మొదలైన కీలక ట్రాఫిక్ పాయింట్ల వద్ద కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కొత్త వ్యవస్థ అంచెలంచెలుగా నెల రోజుల్లో నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు.


