సాగుకు సమాయత్తం | - | Sakshi
Sakshi News home page

సాగుకు సమాయత్తం

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

● ప్రారంభమైన ఖరీఫ్‌ పనులు ● పొలం దుక్కులు, విత్తన మడులు సిద్ధం చేస్తున్న రైతులు ● జిల్లా 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు ● 32 వేల క్వింటాళ్ల విత్తనాలకు ఇండెంట్‌ పెట్టిన అధికారులు

● ప్రారంభమైన ఖరీఫ్‌ పనులు ● పొలం దుక్కులు, విత్తన మడులు సిద్ధం చేస్తున్న రైతులు ● జిల్లా 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు ● 32 వేల క్వింటాళ్ల విత్తనాలకు ఇండెంట్‌ పెట్టిన అధికారులు

జలుమూరు: రబీ పనులు దాదాపు పూర్తయ్యాయి. అపరాలు, మొక్కజొన్న, రాగులు, పొద్దు తిరుగుడు తదితర పంటలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఖరీఫ్‌ సీజన్‌ కోసం రైతులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పొలాలను చదునుచేసి వేసవి దుక్కులు, విత్తన మడులను సిద్ధం చేసి విత్తనాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పనులన్నీ ఒక ఎత్తు అయితే విత్తన ఎంపిక మరో ఎత్తు అని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 4.20 లక్షల ఎకరాలు వరి సాగు అయ్యే అవకాశం ఉంది. ఇందు కోసం వ్యవసాయ శాఖ 32 వేల క్వింటాళ్ల విత్తనాలకు ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే పచ్చిరొట్టకు సంబంధించి అన్ని మండల వ్యవసాయ శాఖ కార్యాలయాలలో విత్తనాలు సిద్ధం చేసింది. రైతులు తక్కువ ఖర్చుతోపాటు మంచి దిగబడులు సాధిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను నరసన్నపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఎల్‌.వి.మధు ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు.

వరుస పద్ధతి మేలు..

●వరి అధిక దిగుబడి సాధించాలంటే నాట్లు పద్ధతిలో వరి సాగుచేయాలి. పచ్చిరొట్ట విత్తనాలు వేసి సుమారు 40 రోజుల్లోపే దమ్ము చేస్తే కలుపు నివారణతోపాటు నాణ్యమైన ఉత్పత్తులు చేయగలం.

● డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో విత్తనాలు వేయడం వల్ల నారుతీయడం, నాట్లు వేయడం చేయకుండా కూలీలు ఖర్చు ఎకరాకు సుమారు రూ.ఏడు వేలు వరకూ తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల నాట్లు వరుస పద్ధతిలో పడతాయి. కాలిబాటలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.

● వరి నారుమడిలో యూజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. ఇందులో మంచి రకాలు ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువులు, కలుపు నివారణ, పురుగు మందులు వాడకంలో వ్యవసాయ శాఖ సూచనలు తప్పనిసరి.

● సాధారణ పరిస్థితిలో నాటడానికి ఎంటీయూ(7029) స్వర్ణ, దీనికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఎంటీయూ–1318 రకం అన్ని భూములకు అనువైనవి. సన్నరకం సాంబకు ప్రత్యామ్నాయంగా 1282 సాగు చేసుకోవచ్చు.

● విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కొన్న రకాల తెగుళ్లను నివారించేందుకు విత్తన శుద్ధి ప్రధానం. దీని కోసం సుడోమోనస్‌, కార్బండిజమ్‌ మందులను వినియోగించుకోవచ్చు.

● నాటే పద్ధతిలో ఎకరానికి 25 నుంచి 30 కేజీల విత్తనాలు సరిపోతాయి. డ్రమ్‌సీడర్‌ ద్వారా ఎనిమిది నుంచి పది కేజీలు, వెద పద్ధతిలో 20 కేజీలు చాలు.

● దృఢమైన, ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే 12 రోజుల ముందే దమ్ముచేయాలి. చిన్నమడులుగా విభజించి అవసరమైన నీరు పెట్టడానికి, తొలగించడానికి పిల్లకాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సెంటు భూమిలో ఐదు కేజీల విత్తనాలు చల్లుకోవాలి. విత్తనం ఎక్కువైతే నారు బలహీనంగా తయారై తెగులు సోకే ప్రమాదముంది. ఎక్కువ విత్తనాలు చల్లుకున్నా వేరు తెగి పిలకలు పెట్టేందుకు వీలుండదు. దీని వల్ల పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. మొలక కట్టిన విత్తనం చల్లుకోవడం మంచిది. రెండుమూడు ఆకులు తొడిగేవరకూ తడి అందించాలి. తర్వాత పలుచగా నీరు పెట్టాలి.

● దమ్ములో ప్రతి ఐదు సెంట్లు నారుమడికి రెండు కిలోల యూరియా, ఏడు కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌, రెండు కిల్లో మ్యారేటి ఆఫ్‌ పొటాష్‌ చల్లుకోవాలి. విత్తిన రెండు వారాలు తర్వాత మళ్లీ రెండు కిలోల యూరియా వేసుకొని అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

Advertisement
 
Advertisement
Advertisement