రాయగడ : స్థానిక రెల్లివీధికి చెందిన హడప నిఖిల్ (18) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు శనివారం అపహరించి అనంతరం హత్య చేసి మృతదేహాన్ని సమీపంలో గల నాగావళి నది వద్ద పడేసిన ఘటనకు సంబంధించి సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మృతదేహాన్ని ఆదివారం నాడు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో సోమవారం స్థానిక రెల్లి వీధి నుంచి వందల సంఖ్యలో బాధిత కుటుంబీకుల బంధువులు, వీధి ప్రజలు మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ నేపథ్యంలొ సదరు పోలీస్ స్టేషన్ వద్ద మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేస్తారన్న సమాచారం మేరకు సదరు పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీస్ బందొబస్తును ఏర్పాటు చేసారు. ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ స్వయంగా సదరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పర్యవేక్షించారు. ఎస్‌డీపీఓ గౌరహర సాహు నేతృత్వంలొ పోలీసులు పోలీస్ స్టేషన్ మెయిన్ గేటును మూసివేసి ఎదుట ఎలాంటి అల్లర్లు జరగకుండా కాపలాకాసారు. రెల్లివీధి నుంచి మృతదేహాన్ని రామాటాకీస్ మీదుగా తీసుకువస్తున్న సమయంలో పోలీసులు ఆర్‌కే నగర్ వైపు వెళ్లాలని పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లకూడదని అడ్డుకున్నారు. అయితే అందుకు ససేమిరా అంగీకరించని ఆందోళనకారులు పోలీసులతొ కాసేపు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిస్తున్నప్పటికీ వారిని తోసుకుంటూ పోలీస్ స్టేషన్ మీదుగా మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఈ పరిస్థితిలో ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగితే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రయత్నం ఉన్న కారణంగా పోలీసులు కాస్త వెనక్కి తగ్గక తప్పలేదు. అక్కడ నుంచి ఆందోళనకారులు మృతదేహాన్ని తీసుకువెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం నాడు స్థానిక ఇందిరానగర్ మూడో లైన్‌లో గుర్తు తెలియని దుండగులు కొంతమంది తన కొడుకును తుపాకీతో బెదిరించి అపహరించి తీసుకువెళ్లిన విషయాన్ని అదే రోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో సదరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, అప్పుడే పోలీసులు అప్రమత్తమై స్పందించి ఉంటే తన కొడుకు హత్యకు గురయ్యేవాడు కాదని మృతుడు నిఖిల్ తండ్రి హడప శివ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడు తన కొడుకు అంత్యక్రియల్లో భాగంగా కొత్తబస్టాండు వద్ద విలేకర్లతో ఆయన మాట్లాడారు. తన కొడుకు మృతికి కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని బహిరంగంగా ఆరొపించారు. తన కొడుకు హత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 14 మంది కలిపి ఈ హత్యకు వల పన్నినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం నిఖిల్ (మృతుడు) వినియోగిస్తున్న బైకును కొత్తబస్టాండు వద్ద గల ప్రధాన రహదారి వద్ద ఆందోళనకారులు పెట్రోల్ పోసి తగుల బెట్టారు.


