ప్రజల విశ్వసనీయత ప్రధానం | - | Sakshi
Sakshi News home page

ప్రజల విశ్వసనీయత ప్రధానం

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

భువనేశ్వర్‌: స్థానిక డీజీపీ క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల సమన్వయం, పోలీసింగ్‌ వ్యవస్థ సమర్థత, ప్రజోపయోగంగా చేరువ కావడం వంటి అంశాలపై సమీక్షించారు. రానున్న 15 రోజుల్లో పోలీసుల సానుకూల పని తీరు, తక్షణ చర్యలు, ప్రజా సేవల పట్ల సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ ఆదేశించారు. నేరాల నియంత్రణలో ప్రజల విశ్వసనీయత చూరగొని ముందుకు సాగడం అత్యంత ప్రయోజనకర సోపానంగా పేర్కొన్నారు. ప్రజలతో సమన్వయం బలోపేతం చేసేందుకు నిర్దిష్టమైన, సమర్థమైన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు, రేంజ్‌ ఐజీలు, డీఐజీలను డీజీపీ ఆదేశించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వెహికల్స్‌ (ఈఆర్‌వీ)లో పని చేసే సిబ్బంది అందరికీ వృత్తిపరమైన, ఆచరణాత్మక శిక్షణ కల్పించాలన్నారు. సమయోచిత శిక్షణ, క్లిష్టమైన, అత్యవసర పరిస్థితులలో సత్వర ప్రతిస్పందనకు పదును పెడుతుందని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా బ్రీఫింగ్‌ పరేడ్‌

రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ప్రతి రోజూ ఉదయం 9 గంటలలోపు క్రమం తప్పకుండా బ్రీఫింగ్‌ పరేడ్‌ నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. దీన్ని సక్రమంగా అమలు జరిగేలా చూడాలని, క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. బ్రీఫింగ్‌ పరేడ్‌ అనంతరం, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, నేరస్థుల కదలికలు, కొనసాగుతున్న దర్యాప్తులపై సమీక్షించి, చర్చించాలని సూచించారు. పోలీస్‌ ఠాణా స్థాయిలో సమన్వయం, అప్రమత్తత, త్వరితగతిన స్పందించే సామర్థ్యం మరింత బలపడతాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పటిష్టతకు వివిధ కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ముఖ్యంగా కొనసాగుతున్న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ల (ఎన్‌బీడబ్ల్యూ)ను వేగంగా అమలు చేయడం, జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కరడుగట్టిన, నిత్య నేరస్థులపై కఠిన చర్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంపై దృష్టి సారించాలన్నారు. అన్ని పోలీస్‌ ఠాణాల్లో బీట్‌ పెట్రోలింగ్‌, జాతీయ రహదారులపై సాధారణ పెట్రోలింగ్‌ విస్తరణ, దుష్ప్రవర్తన, నేర సంబంధిత ఘటనలను నివారించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. హత్య వంటి తీవ్రమైన కేసులను సీనియర్‌ పోలీస్‌ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించి నిందితులను త్వరగా అరెస్టు చేయడం, సమగ్ర దర్యాప్తుతో చట్ట ప్రకారం శిక్ష పడేలా సమర్థమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. సమావేశంలో డీజీపీ (క్రైం శాఖ) బినయ్‌తోష్‌ మిశ్రా, ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌ ఆర్పీ కోచే, అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (శాంతి భద్రతలు) సంజయ్‌ కుమార్‌ ప్రముఖంగా పాల్గొన్నారు. డీజీపీ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా భువనేశ్వర్‌ కమిషనరేట్‌ పోలీస్‌ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణపై చర్యలు, సున్నితమైన కేసుల తక్షణ, నిష్పక్షపాత దర్యాప్తు, సామాన్య ప్రజలతో పోలీసుల సానుకూల మమేకత్వం, ట్రాఫిక్‌ వ్యవస్థ సులభతర నిర్వహణ వంటి అంశాలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కటక్‌, భువనేశ్వర్‌ జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌. దేవ దత్త సింగ్‌, అదనపు పోలీస్‌ కమిషనర్‌ నరసింగ్‌ భోలా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement