జనావాసాల్లోకి జింక పిల్ల | - | Sakshi
Sakshi News home page

జనావాసాల్లోకి జింక పిల్ల

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

నిందితులను పట్టుకుంటాం: డీఐజీ

రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌ సమితి పరిధి చాటికొన పంచాయతీ రాణిబంధ గ్రామంలోకి సోమవారం ఉదయం జింక పిల్ల ప్రవేశించింది. సమీప అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి గ్రామంలోకి చేరుకుందని భావిస్తున్నారు. జింకపిల్లను చూసిన గ్రామస్తులు దానికి ఎలాంటి హాని తలపెట్టకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ గార్డులు చేరుకుని జింకపిల్లను రక్షించారు. అయితే అది అస్వస్థతతో పడి ఉండటం గమనించి తమ వెంట తీసుకువెళ్లి చికిత్స జరిపిన అనంతరం తిరిగి అడవుల్లో విడిచిపెట్టేస్తామని చెప్పారు.

పద్మపూర్‌లో వినతుల స్వీకరణ

రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌లోని సమితి కార్యాలయం సమావేశం హాల్‌లో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలొ వివిధ ప్రాంతాల నుంచి 29 వినతులు అందాయి. వీటిలో 26 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించగా మరో మూడు గ్రామ సమస్యలుగా గుర్తించారు. స్వీకరించిన వినతుల్లో గ్రామ సమస్యలను పరిశీలించి వాటిని సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలొ జిల్లా పరిషత్‌ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్‌ ఖెముండో, గుణుపూర్‌ సబ్‌ కలెక్టర్‌ దుదూల్‌ అభిషేక్‌ దిల్లిప్‌, ఏఎస్పీ గోసొనొర్‌ బర్లా, ఐటీడీఏ గుణుపూర్‌ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ అజయ్‌ కుమార్‌ ప్రధాన్‌ పాల్గొన్నారు.

కార్మిక నేతకు వీడ్కోలు

భువనేశ్వర్‌: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్‌ మండలం శ్రామిక కాంగ్రెస్‌ నేత సరోజ్‌ కుమార్‌ మంగరాజ్‌కు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ప్రధాన టికెట్‌ తనిఖీ అధికారిగా ఉద్యోగ విరమణ సందర్భంగా శాఖ కార్యదర్శి లక్ష్మీధర మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో పలువురు కార్మిక నేతలు ప్రసంగించారు.

రాయగడ: స్థానిక రెల్లివీధికి చెందిన నిఖిల్‌ అడప అనే యువకుని హత్య కేసుకు సంబంధించి దక్షిణాంచల్‌ డీఐజీ కన్వర్‌ విశాల్‌ సింహ్‌ ప్రత్యేక దర్యాప్తునకు రాయగడ చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిఖిల హత్య కేసు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీస్‌ టీం లను ఏర్పాటు చేసామని అన్నారు. అనుమానితుల సంఖ్య పెరగడంతో మరో మూడు టీమ్‌లు వేశామని పేర్కొన్నారు. వీరంతా గాలిస్తున్నారని తెలిపారు. సైబర్‌, టెక్నికల్‌ వంటి బృందాలకు చెందిన వారి సహాయాన్ని తీసుకుంటున్నామని అన్నారు. నిందితులు తుపాకీలు వినియోగిస్తున్నారు, అవి వారికి ఎలా లభ్యమవుతున్నాయన్న విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ దానిపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నామని, మరో 15 రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడించడంతో పాటు ఆయుధాల సరఫరా, రవాణాకు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement