నకిలీ డీఈఎఫ్‌ తయారీ ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ డీఈఎఫ్‌ తయారీ ముఠా గుట్టురట్టు

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

ఝార్సుగుడలో వెలుగుచూసిన వైన

రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్టు

రాయగడ: ఝార్సుగుడ జిల్లాలో నకిలీ డీజిల్‌ ఎగ్జాస్ట్‌ ఫ్యూయిడ్‌ (డీఈఎఫ్‌) తయారీ వ్యవహారంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆపరేషన్‌ నేత్రలో భాగంగా జిల్లా ఎస్‌పీ జి.ఆర్‌.రాఘవేంద్ర ఆదేశాల మేరకు సదరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిరియాబగిచా ప్రాంతంలో నడుస్తున్న అక్రమ డీఈఎఫ్‌ తయారీ యూనిట్‌ను ఇటీవల పోలీసులు గుర్తించి భారీ ఎత్తున సామగ్రిని స్వాఽధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగంగా రాజస్థాన్‌లోని తంగగజి జిల్లా అల్వార్‌ ప్రాంతానికి చెందిన ముఖేష్‌ చాంద్‌, ఝార్సుగుడ జిల్లాలోని ఒరియంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి లమిటిబహాల్‌ ప్రాంతానికి చెందిన అమన్‌ కుమార్‌ సింగ్‌, సిరియాబగిచ ప్రాంతానికి చెందిన రాజ్‌ కుమార్‌ హెంబ్రమ్‌, బ్రిజిభూషన్‌ సింగ్‌, ఛత్తీస్‌గఢ్‌ జిల్లాలోని దులుదులా పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన జియల్‌ అన్సారి, బరగడ జిల్లాకు చెందిన ఆకాష్‌ అగ్రవాల్‌, ఝార్సుగుడ జిల్లాలోని పార్ధశారధి మిశ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 422 లీటర్ల సామర్ధ్యం గల ఖాళీ బకెట్లు, రెండు వాహనాలు, తదితరమైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్‌పీ ఆదేశాల మేరకు డీఎస్పీస్థాయి అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందం రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌కు వెళ్లి ఈ కేసులో ప్రధాన సూత్రధారి అనూజ్‌ అగ్రవాల్‌ను అరెస్టు చేసి ఝార్సుగుడకు తీసుకువచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ఎస్‌పీ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల మేరకు.. రైతులకు సరఫారా చేయాల్సిన సబ్సిడీ యూరియాను నీటితో కలిపి డీఈఎఫ్‌గా తయారీ చేసి టాటా, అశోక్‌టైలాండ్‌ మహేంద్ర వంటి ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ బ్రాండింగ్‌ చేసి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని వివరించారు. దీనిని అనుసరించి దర్యాప్తు చేయగా పూర్తి వివరాలు బయటపడ్డాయని అన్నారు. ఈ నకిలీ తయారీ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌, ముడిసరుకుల సరఫరా, సబ్సిడీ యూరియా మళ్లింపు ఇతర సంబంధిత వ్యక్తుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement