● ఒడిశాలో జోరుగా పేకాట శిబిరాలు
● పాతపట్నం నియోజకవర్గానికి కూతవేటు దూరంలోనే
● అక్కడి పోలీసులు పట్టించుకోరు.. మన పోలీసులు వెళ్లలేరు
● మూల్యం చెల్లించుకుంటున్న జిల్లావాసులు
జూదం నిషేధం..
జూదం, జూద శిబిరాలు నిషేధం. అలాంటివి ఎక్కడైనా నిర్వహిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. జూదం ఆటలో పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. అటువంటివి నిషేధం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– చింతాడ ప్రసాద రావు, సీఐ, కొత్తూరు
హిరమండలం: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జూదం శిబిరాలు కొనసాగుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గం చెంతనే ఒడిశా భూభాగంలోని కొండ ప్రాంతాల్లో డెన్‌లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. లక్షలు దాటి కోట్లాది రూపాయల ‘ఆట’ కొనసాగుతున్నట్టు సమాచారం. అటువైపు ఏపీ పోలీసులు వెళ్లరు.. ఒడిశా పోలీసులు పట్టించుకోరు అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ జూదం మాటున అసాంఘిక కార్యకలా పాలు కూడా కొనసాగుతున్నట్టు సమాచారం. మూడు నాలుగు రోజుల కిందట జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఒడిశా జూదం డెన్‌కు వెళ్లిన వారికి అనుకొని ఘటన ఎదురైనట్టు తెలుస్తోంది. ఓ ముఠా ఆయుధాలతో బెదిరించి రూ.36 లక్షలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో జూదంరాయుళ్లు కట్టుబట్టలతో స్వస్థలాలకు చేరుకున్నట్టు సమాచారం.
గారబంద, గొసాని, ఏడో మైలురాయి, లావణ్యకోట వంటి ప్రాంతాలు పాతపట్నం నియోజకవర్గానికి చెంతనే ఉంటాయి. మహేంద్రగిరులు సైతం దగ్గరే ఉంటాయి. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా జూదం డెన్‌లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రవేశానికి కొంత రుసుం ఉంటుంది. సకల సౌకర్యాలు కూడా లభిస్తాయి. డెన్‌లు కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. అక్కడకు వెళ్లేవారికి రెండంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అంతా ప్రైవేటు వ్యక్తుల పహారాలో ఉంటుంది. జూదం శిబిరానికి వచ్చేవారి వాహనాలను రెండు కిలోమీటర్ల దూరంలో అడ్డుకుంటారు. అక్కడి నుంచి వారిని తమ సొంత వాహనాల్లో స్థావరాలకు తెస్తారు. మన జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం నగరంతో పాటు పలాస, టెక్కలి, నరసన్నపేట ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారు.
మెళియాపుట్టితో పాటు పలాస మార్గాల నుంచి నిత్యం ఖరీదైన వాహనాలు వెళుతుంటాయి. అందు లో ఎక్కువగా జూదం డెన్‌లకే వెళుతుంటాయన్నది స్థానికుల మాట. అయితే ఒడిశాకు చెందినే వారే ఈ జూదం డెన్‌ల నిర్వాహకులు. అటువైపు అక్కడి పోలీసులు చూడరు. ఏపీ పోలీసులు చూసేటంత సాహసం చేయరు. ఎందుకంటే ఈ జూదం డెన్‌లన్నీ మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. చుట్టూ భారీ బౌన్సర్ల వలయం ఉంటుంది. ఒక వేళ పోలీ సులు దాడిచేసినా నగదు దొరకకుండా అ న్ని జాగ్రత్తలు తీసుకుంటారు. టోకెన్ల సిస్టమ్ ఉంటుంది. జూదంకు వచ్చేవారు రూ.1500 ఇచ్చి ఎంట్రీ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రూ.5 వేల నుంచి రూ.3 లక్షల వరకూ టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఆట గెలిచిన వారు చివరిలో టోకెన్లు సెక్యూరిటీ సిబ్బందికి ఇస్తే వారు నగదు అందిస్తారు. మరోవైపు జూదం డెన్‌లో ప్రామిసరీ నోట్లు సైతం అందుబాటులో ఉంటాయి. ఎవరైనా డబ్బు లు అవసరమైతే వారి ఆధార్, ఇతర ధ్రువీకరణతో అప్పు ఇస్తారు. వారితో ప్రామిసరీ నోటు రాయించుకుంటారు. డెన్‌లోనే భోజనం, మందు, ఇతరత్రా స్నాక్స్, టీ, బిస్కెట్ వంటివి అందుబాటులో ఉంటా యి. అయితే జూదంతో నష్టం ఎక్కువగా జూదరులకు జరుగుతుండగా.. నిర్వాహకులు మాత్రం కో ట్లు కొల్లగొడుతున్నారు. అయితే బాధితుల్లో ఎక్కువ మంది మన జిల్లావాసులే. ఇప్పటికై నా జిల్లా పోలీస్ యంత్రాంగం, ఒడిశా అధికారులతో సంయుక్తంగా ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు.


