శ్రీ జగన్నాథుని పేరుతో ప్రత్యేక చానెల్‌ యోచన | - | Sakshi
Sakshi News home page

శ్రీ జగన్నాథుని పేరుతో ప్రత్యేక చానెల్‌ యోచన

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

శ్రీ జగన్నాథుని పేరుతో ప్రత్యేక చానెల్‌ యోచన

భువనేశ్వర్‌: రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జగన్నాథుని సంస్కృతి విస్తృత ప్రసారానికి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ జగన్నాథుని పేరుతో ఒక ప్రత్యేక టీవీ చానెల్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ఆరంభించారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ అధ్యక్షతన లోక్‌ సేవా భవన్‌ న్యాయ శాఖ సమావేశం హాలులో చర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత కొత్త చానెల్‌ స్వరూపం, రోజువారీ కార్యక్రమాలు, జగన్నాథ సంస్కృతి వ్యాప్తి, భక్తుల మనసుల్లో జగన్నాథుని పట్ల భావాలను ప్రేరేపించే ప్రతిపాదిత ప్రసారాలపై చర్చించారు. చానెల్‌ ఏర్పాటుపై జరిగిన ప్రాథమిక చర్చలు సానుకూలంగా సాగాయి. జగన్నాథ సంస్కృతిపై మరింత పరిశోధన, చర్చల ద్వారా యావత్‌ ప్రపంచానికి అవగాహన కల్పించడం, భక్తులకు జగన్నాథుని మహాత్యం, ఆధ్యాత్మిక భావాల గురించి తెలియజేయడం, భక్తుల అనుభవాల ప్రతిస్పందన వంటి శీర్షికలతో ప్రసారం చేయడం ఈ చానెల్‌ ఏర్పాటు యోచన ప్రధాన లక్ష్యంగా మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. దీనిపై మరిన్ని చర్చలు జరిపి, పూర్తి ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి శ్రీ మందిరం ముఖ్య నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ పాఢి హాజరు అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement