కొండచరియలు పడకుండా ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

కొండచరియలు పడకుండా ప్రత్యేక చర్యలు

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

కొండచరియలు పడకుండా ప్రత్యేక చర్యలు

రాయగడ: రైల్వే లైన్లలో వర్షా కాలంలో కొండచరియలు, బండరాళ్లు జారిపడటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపధ్యంలో రైల్వే శాఖ అందుకు నివారణ చర్యలను చేపట్టింది. ముఖ్యంగా కొరాపుట్‌–రాయగడ (కే ఆర్‌) లైనులో కొండ చరియలు జారిపడుతుండటంతో ఆందోళన కలిగించే విషయంగా భావించిన రైల్వేశాఖ అందుకు అనుగుణంగా నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. కొండచరియల నుంచి ఇటాలియన్‌ వైర్‌ మెస్‌ రక్షణ కల్పించేలా రక్షణ గోడను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో మొదటిసారిగా రాయగడ జిల్లాలో దీనిని ప్రారంభించడం విశేషం. రాయగడలోని మజ్జిగౌరి మందిరానికి దగ్గరలో ఉన్న కొండలపై పనులను రైల్వే శాఖ ప్రారంభించింది. కొండపై డ్రిల్లింగ్‌ మెషిన్‌ సహాయంతో రంధ్రాలు చేసి ఆ రంధ్రంలో ఇనుపు ఊచలను ఏర్పాటు చేసి వైర్‌ మెస్‌ను నిర్మిస్తున్నారు. వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో జారిపడే కొండచరియల నుంచి ఈ మెస్‌ రక్షణ కల్పిస్తుంది. రాయగడ, కాసీపూర్‌ సమితుల్లో ఇటువంటి తరహా ఇటాలియన్‌ మెస్‌ రక్షణ గోడలను రైల్వే శాఖ నిర్మిస్తుంది. వర్షాకాలానికి ముందే ఈ పనులను పూర్తి చేయాలన్న సంకల్పంతో శరవేగంగా నిర్మిస్తున్నారు. స్థానిక మజ్జిగౌరి మందిరానికి సమీపంలో సుమారు 3 వేల కిలోల సామర్ధ్యం గల 230 మీటర్ల పొడవైన భద్రతా గోడను, అదేవిధంగా కాసీపూర్‌ సమితిలో 500 కిలోల సామర్ధ్యం గల సుమారు 70 మీటర్ల పోడవైన ఇటాలియన్‌ మెస్‌ రక్షణ గోడను నిర్మిస్తుండటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement