భువనేశ్వర్: బలియంత దారుణ హత్యా ఘటనతో యావత్ రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. లైంగిక వేధింపుల ఆరోపణ కింద గ్రామస్తులు మూక దాడికి పాల్పడి యువకుడిని చావగొట్టారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం ఘటనా స్థలం చేరింది. రాష్ట్ర పోలీస్ డైరెక్టరు జనరల్, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు సంఘటనా స్థలం ప్రత్యక్షంగా సందర్శించి విచారణ చేపట్టారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియాతో నగర డీసీపీ జగ మోహన్ మీనా, బలియంత ఠాణా పోలీసులు సంఘటనా స్థలంలో విచారణ జరుపుతున్నారు. అదే విధంగా ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శోభనా మహంతి బలియంత ప్రాంతంలో హత్య ఘటనా స్థలం సందర్శించారు. ఆ ప్రాంతంలో ప్రాథమిక విచారణ నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన తర్వాత మహిళా కమిషన్ చైర్ పర్సన్ బాధితుడి ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని కమిషన్ చైర్ పర్సన్ తెలిపారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక దాఖలు చేయనున్నట్లు వివరించారు. దోషులపై చర్య తీసుకోవడం తథ్యమని హామీ ఇచ్చారు. ఈ హృదయ విదారక ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. అందుబాటులో ఆధారాల వనరుల నుంచి మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. మృతుడు సౌమ్య రంజన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గురు వారం రాత్రి పొద్దుపోయే వరకు బలియంత పోలీస్ ఠాణా బయట నిరసన చేపట్టారు. ఇలాంటి మూక దాడులు మళ్లీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఒడిశా కానిస్టేబుల్ సిపాయి మహాసంఘ్ ప్రభుత్వవ రైల్వే పోలీసు (జీఆర్‌పీ) సూపరింటెండెంటుతో భేటీ అయింది. ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని సిపాయి మహాసంఘ్ అభ్యర్థించింది. ఈ ఘటనపై సరైన దర్యాప్తు చేపట్టడంతో మృతుడు సౌమ్య రంజన్ కుటుంబానికి రక్షణ కల్పించాలని సంఘం ప్రతినిథులు కోరారు.


