ఒత్తిడి వల్ల కలిగే దుష్ప్రభావాలు
ఇలా అధిగమించవచ్చు
నిద్ర తగ్గితే ప్రాణహాని
స్మార్ట్ స్క్రీన్ల వెలుగులో ‘మెలటోనిన్’ హార్మోను రాను రానంటోంది. మొబైల్ ఫోన్ల మాయలో పడి ‘సెరొటోనిన్’ రావడమే మానేసింది. ఈ రెండూ లేకుంటే మనిషికి నిద్ర లేదు.. జీవికి ప్రశాంతత లేదు. రాత్రంతా కొరివి దెయ్యాల్లా కళ్లు ఎర్రగా మండేంత వరకు సెల్‌ఫోన్ చూడడం, నిశాచరుల్లా తిరగడం, ఇష్టానుసారం తినడంతో ఈ హార్మోన్ల అసమతుల్యత తప్పడం లేదు. ఒకప్పుడు టీవీ చూస్తూ ఆవులింతలు తీయడం, మాటలు వింటూ కునికి పాట్లు పడడం అన్నది ఈ తరానికి పూర్తిగా దూరమైపోయింది. అర్ధరాత్రి దాటినా చాలా మందిని నిద్ర కరుణించడం లేదు. దీని ఫలిత మే సవాలక్ష ఆరోగ్య సమస్యలు.
శ్రీకాకుళం కల్చరల్: ఉరుకులు, పరుగులు, హడావుడి.. బతుకుంతా ఇలాగే మారిపోయింది. ఈ గజిబిజి జీవనంలో కంటి నిండా నిద్రపోయే అదృష్టానికి చాలా మంది నోచుకోవడం లేదు. ఫలితంగా ఎంతో మంది ఒత్తిడికి గురై వారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, హార్మోన్ల సమతుల్యత లోపించడం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి.
ప్రస్తుతం కుటుంబాల్లో మానసిక ఉల్లాసం కనిపించడం లేదు. నేటి పరిస్థితులలో జీవన సమస్యలు ఎదుర్కోవాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. విధులు ముగించుకొని ఇంటికి వచ్చాక, ఎవరి ఫోన్‌తో వారు కాలక్షేపం చేస్తున్నారు. కనీసం పిల్లల గురించైనా పట్టించుకోవడం లేదు. కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం అంతకంటే లేదు. దీంతో మానసిక ఉల్లాసం కొరవడుతోందని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం పిల్లలతో కలిసి కాసేపు పార్కులకు వెళ్లి గడపడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
నిద్ర పట్టకపోవడం.
ఆకలి లేకపోవడం, ఎక్కువ తినాలనిపించడం.
హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళలలో పీరియడ్స్ ఇబ్బందులు.
ఒత్తిడి ఉన్న వారిలో
హృద్రోగ సమస్యలు.
వ్యాధి నిరోధక శక్తి
తగ్గి ఇన్‌ఫెక్షన్లు సోకడం.
నిద్రకు దూరమవుతున్న యువత
చుట్టు ముడుతున్న ఆరోగ్య సమస్యలు
గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్‌లకు ఇదీ ఓ కారణం
మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత
రోజూ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవడం.
ఒకే సమయానికి రోజూ నిద్రించడం అలవాటు చేసుకోవాలి.
సమతుల ఆహారం తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
యోగా, మెడిటేషన్‌పై దృష్టి సారించాలి.
సెల్‌ఫోన్ చూడడం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి.
భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి.
అసమానతలు, సమస్యలను ధైర్యంగా
పరిష్కరించుకోవాలి.
నిద్ర తగ్గితే ప్రాణ హాని కలుగుతుంది. శారీరక, మానసిక ఒత్తిడులు నిద్రలేమి వల్లనే కలుగుతాయి. వృత్తిపరమైన స్ట్రెస్, పర్సనల్ లైఫ్ సమస్య, ఎగ్జైట్‌మెంట్ వల్ల మానసిక వ్యాధులు వస్తాయి. పిల్లలైనా పెద్దవారైనా ప్రతి వారు శారీరక వ్యాయామం, ఆటపాటల వల్ల మంచి నిద్ర పట్టి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. – జి.రోష్‌మల్లికార్జున్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు, శ్రీకాకుళం


