జీడి.. ఇంటికి చేరిందండి | - | Sakshi
Sakshi News home page

జీడి.. ఇంటికి చేరిందండి

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

జీడి.. ఇంటికి చేరిందండి

ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పిక్కలు

దేశీయ పిక్కలపై ఆసక్తి చూపని వ్యాపారులు

పలాస: ఉద్దానం ప్రాంతంలో ప్రజల జీవనాధారమైన జీడి పంట రైతుల ఇళ్లకు చేరింది. వాటిని అమ్ముకోవడానికి ఆశగా రైతులు ఎదురు చూస్తున్నారు. గత నెల ఏప్రిల్‌ మొదటి వారం నుంచి తోటల్లో జీడి పిక్కలు కాపునకు వచ్చాయి. వాటిని తోటల్లో సేకరించి ఎండబెట్టి గోనె సంచుల్లో నింపి భద్రపరిచారు. ప్రస్తుతం జీడి పంటలు ఆఖరి దశకు చేరుకున్నాయి. పలాస నియోజకవవర్గంలోని పలా స మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో గల జీడి తోటల్లో పిక్కలు ఇళ్ల వద్దకు చేరుకున్నాయి. అయితే గ్రామాల్లోకి వ్యాపారులు ఇంకా రావడం లేదు. ఇప్పటికే విదేశీ పిక్కలను దిగుమతి చేసుకున్న పలాస వ్యాపారులు ప్రస్తుతం వాటిపైనే ఆధార పడి తమ పరిశ్రమలను నడిపించుకుంటున్నారు. దీంతో వారంతా ధీమాగా ఉన్నారు. ఏటా ఇదే తంతు జరుగుతోందని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పలాస పప్పు అంటే ఉద్దానం జీడి పిక్కల వల్లనే వాటికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పు డు ఉద్దానం పిక్కలను కొనుగోలు చేయడానికి వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ఎలాగైనా ఎప్పు డో ఒకప్పుడు తమకే అమ్ముతారన్న ధీమా వారిలో నాటుకు పోయింది. అలాగే రైతులు కూడా చిరకాలంగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం, వారితో ఉన్న అవినాభావ సంబంధాల మేరకు వారికే పిక్కలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకా పిక్కల ధరలు తేలలేదు. రైతు సంఘాల మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. 80 కిలోల బస్తా పిక్కలను రూ.16వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న వారి డిమాండు ఏడాది ఎంత వరకు నెరువేరుతుందో వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement