● వృథాగా డ్రైవర్ల సంఘం భవనం
● సచివాలయానికి అప్పగించాలని పూర్వపు అధ్యక్షుల డిమాండ్
శ్రీకాకుళం పీఎన్ కాలనీ: జిల్లా కేంద్రంలో ఉన్న డ్రైవర్ల సంఘం కార్యాలయ భవనం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ భవనం ద్వా రా వస్తున్న ఆదాయం ఎవరికి వెళ్తోంది, ఎక్కడ ఖర్చవుతోంది అన్నది తెలియకుండా ఉందని డ్రైవ ర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాన్ని అనీల్‌చంద్ర పునేఠ కలెక్టర్‌గా ఉన్న సమయంలో డ్రైవర్ల కు అప్పగించారు. రౌతు సింహాచలం ఈ సంఘాని కి అధ్యక్షులుగా ఉన్న సమయంలో 2014లో రూ.14 లక్షలతో భవనానికి మరమ్మతులు నిర్వహించి పక్కా షాపులు నిర్మించారు. అనంతరం అద్దెల వసూలు మొదలుపెట్టారు. నెలకు సుమారు రూ.50వేలకు పైగా అద్దెలు వస్తున్నాయి. ఇన్నేళ్లలో దాదాపు లక్షల్లో అద్దె రూపంలో వచ్చిఉండాలని, కానీ ఆ డబ్బుకు లెక్కా పత్రం లేకుండా పోయిందని సంఘానికి చెందిన వారు ఆరోపిస్తు న్నారు. ఇప్పటికే డ్రైవర్లు కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ రూమ్ ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వాహనాల డ్రైవర్లు సుమారు 320 మంది ఉండేవారు. వారంతా పదవీ విరమణ చేయడంతో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. గతంలో వాచ్‌మెన్‌లను పెట్టి అన్ని రకాల క్లీనింగ్‌లు వంటివి చేసేవారు.
కలెక్టరేట్‌లో డ్రైవర్‌గా ఉన్న ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనే పెత్తనమంతా చెలాయిస్తున్నట్లు ఆ సంఘ నాయకులే చెబుతున్నారు. భవనానికి వచ్చిన రాబ డి అంతా సొంత ఖర్చులకు వాడుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. తాను కలెక్టరేట్ డ్రైవర్‌నని తనను ఎవరూ ఏమీ చేయలేరని డాంబికాలు పలుకుతున్నట్లు సమాచారం. ఓ ఇద్దరు వ్యక్తులే వచ్చిన కాడికి తినేస్తున్నట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. అద్దెలు కలెక్షన్ చేస్తున్నారే తప్ప ఎలాంటి లెక్కలు చూపించడం లేదని, సంఘ భవనాన్ని అభివృద్ధి చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ ఆదాయాన్ని ప్రభుత్వానికి మళ్లించగలిగితే బాగుంటుందని పూర్వపు అధ్యక్షులు, సంఘ నాయకులు కోరుతున్నారు. కనీసం సచివాలయాలకైనా ఇస్తే ఆ డబ్బులైనా మిగులుతాయని అంటున్నారు.


