రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్
రాయగడ: రానున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు భవిష్యత్‌లో రాయగడ జిల్లాలో బీజేపీ జెండా ఎగిరేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ అన్నారు. రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కోడూరు నారాయణరావు నేతృత్వంలో రాయగడ జిల్లా నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మన్మోహన్ సామల్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పేలా కార్యకర్తలు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా మూడు రాష్ట్రాల్లో పార్టీ విజయ ఢంకా మోగించిందని గుర్తు చేశారు. రానున్న కాలంలో బీజేపీ ఇక తిరుగులేని పార్టీగా మారే అవకాశం ఉందన్నారు. పార్టీలో చేరిన ప్రతీ ఒక్క కార్యకర్త నిస్వార్థంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. చేరికల్లో భాగంగా బీజేడీ సీనియర్ నాయకుడు కాశీనాయుడు, కె.శ్రీధర్ తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, కాళీరాం మాఝి, ఎస్డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియాక, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


