నాటు తుపాకులు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నాటు తుపాకులు స్వాధీనం

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

● గుణుపూర్‌లో ఘటన

రాయగడ: ఆపరేషన్‌ నేత్ర కార్యక్రమంలో భాగంగా ఝార్సుగుడ పోలీసులు ఇటు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు అటు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ మారణాయుధాలను రవాణా చేసే ముఠాఆటను కూడా కట్టిస్తున్నారు. జిల్లా ఎస్పీ గుండాల రాఘవేంద్ర ఆదేశాల మేరకు బ్రజరాజ్‌నగర్‌, ఒరియంట్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో నాటు తుపాకీల అక్రమ రవాణాకు సంబంధించి ఆదర్శ దుబే అలియాస్‌ బిట్టు, మహమ్మద్‌ రఫీ అన్సారీలను పట్టుకుని వారి నుంచి నాలుగు నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. బిహార్‌ నుంచి నాటుతుపాకీలను రవాణా చేసి వాటిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తుపాకులతో పాటు నాలుగు రౌండ్ల ఎమ్యూనేషన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

బీజేపీ శ్రేణుల విజయోత్సవాలు

జయపురం: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు జయపురంలో మంగళవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత గౌతమ సామంతరాయ్‌ మాట్లాడుతూ.. 15 ఏళ్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనను అంతమొందించి బీజేపీ చారిత్రిక విజయం సాధించిందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌ చరిత్రలో తాజాగా జరిగిన ఎన్నికల్లో మొదటిసారి బీజేపీ అపూర్వ విజయం సాధించి అధికారంలోనికి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది గర్వించదగ్గ విషయమన్నారు. సామంతరాయ్‌ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక రాజనగర్‌ కూడలి వద్ద బాణసంచా కాల్చి విజయోత్సవం జరుపుకున్నారు. మిఠాయి పంచి సందడి చేశారు. జయపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు ఎస్‌.మనోజ్‌కుమార్‌, రాష్ట్ర పార్టీ కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ సామంతరాయ్‌, మహిళా మోర్చ కార్యకర్తలు, యువమోర్చ నాయకులు పాల్గొన్నారు.

కత్తితో మహిళను బెదిరించి మంగళ సూత్రం దోపిడీ

రాయగడ: మహిళను కత్తితో బెదిరించి ఆమె వద్ద గల బంగారు మంగళసూత్రాన్ని దొంగిలించిన ఘటన జిల్లాలోని గుణుపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు గుణుపూర్‌ ఆదర్శ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గుణుపూర్‌లోని బబులినగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి .. మహిమానగర్‌కు చెందిన టి.బాలేశ్వరి ఆచారి అనే మహిళ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వ్యక్తిగత పనిపై బబులినగర్‌ పార్క్‌ వైపు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆమెను ఆపి కత్తిచూపి బెదిరించారు. అనంతరం ఆమె మెడలోని బంగారు మంగళసూత్రాన్ని తెంపుకొని పరారైనట్టు చెప్పారు.

ముగిసిన నీలమ్మ సంబరాలు

పర్లాకిమిడి: స్థానిక తొమ్మిదో వార్డు మార్కెట్‌ జంక్షన్‌ వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామదేవత నీలమ్మ సంబరాలు బుధవారం అనుపోత్సవంతో ముగిశాయి. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఘటాలతో వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement